బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక..
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
- కుర్తివాడలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి
పాపన్నపేట,అక్టోబర్18: బతుకమ్మ(Bathukamma) పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో అంతర్భాగమని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు వాటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
బతుకమ్మ పండుగ మహిళల మధ్య ఐక్యతను, ఆప్యాయతను పెంపొందిస్తుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కుర్తివాడలో మహిళలు తీరొక్క రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహించారు.
పద్మా దేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడటంతో వేడుకల్లో ఉత్సాహం నెలకొంది. అదేవిధంగా గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ నాయకులు, దుర్గామాత మాలదారులు మాజీ ఎమ్మెల్యేను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు సోములు, నరేందర్, జీవన్ రావు, మండల నాయకులు కుమ్మరి జగన్, కిష్టా గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, సిద్దిరెడ్డి, వెంకటేశం, పోతాగౌడ్, మోహన్ రావు, దత్తు, శివకుమార్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.