ఆలేరులో బతుకమ్మ సంబరాలు
రోజుకో రూపంలో బతుకమ్మను పేర్చి.. ఆటపాటలతో మహిళల సందడి
ఆలేరు, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఆలేరు పట్టణంలోని(Alair town) అంబేద్కర్ నగర్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు.
ప్రతి రోజు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ, ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను ప్రత్యేకంగా పేర్చి,మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా నిలిచాయని స్థానికులు పేర్కొన్నారు. అంబేద్కర్ నగర్లో బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపగా, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.