సమైక్యతతో పండుగలు జరుపుకోవాలి
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మందమర్రి, అక్టోబర్ 18 : ప్రజలు సమైక్యతతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Gaddam Vivek Venkatswamy) అన్నారు. ఆదివారం క్యాతనపల్లి పురపాలక పరిధిలో(Kyatanapalli Municipal Limits) జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak), సింగరేణి సంస్థ(Singareni Company) మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, డి.సి.సి. రఘునాథ్, అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసికట్టుగా దుర్గాపూజ, బతుకమ్మ పండుగలను జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఈ పండుగల ద్వారా శాంతి, సౌభాగ్యాలు, సామరస్యం చేకూరాలని తెలిపారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుర్గాపూజ, సద్దుల బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయని, ఈ వేడుకలలో భాగంగా రామకృష్ణాపూర్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేది సద్దుల బతుకమ్మ అని, మహిళలందరూ పిల్లలతో కలిసి సంప్రదాయబద్ధంగా తరలివచ్చి సంబరాలు జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. అనంతరం రామకృష్ణాపూర్ లో నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ పరిధిలో ని 5వ వార్డులో కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంత్రి సతీమణి సరోజ, జిల్లా కలెక్టర్ లతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.