పసి కూన ప్రతిభకు ప్రపంచమే వందనం..

08-10-2026 | 06:54pm
  1. సువిక్షనందనకు రికార్డు కిరీటం..
  2. సాధనాత్ సాధ్యతే సర్వం

పాపన్నపేట,అక్టోబర్08: ఈ చిన్నారి పుట్టి కేవలం 73 రోజులే అవుతుంది. ఇంత చిన్న వయస్సులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో(World Book of Records) చోటు దక్కించుకొని అరుదైన ఘనత సాధించింది. పసితనం వీడకముందే అరుదైన రికార్డును సృష్టించింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్ గ్రామానికి చెందిన చిన్నారి లింగంపల్లి సువిక్ష నందన.

కేవలం 2 నెలల 13 రోజుల వయసులో తల్లిదండ్రుల సహాయంతో నిటారుగా ఉన్న స్థితిలో తలను పైకి ఎత్తి, ఇరువైపులా తిప్పిన ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆమె ప్రతిభను గుర్తించింది.

సాధనాత్ సాధ్యతే సర్వం

సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని మరో సారి నిరూపించింది సువిక్ష నందన. చిన్నారి తల్లిదండ్రులైన లింగంపల్లి జనార్ధన్-రజిత తెలంగాణ వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణాధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు చిన్నారి ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతిరోజూ కొద్దిసేపు టమ్మీ టైమ్ చేయించేవాళ్లమని,

ఈ చిన్న ప్రయత్నం ఈ రోజు ప్రపంచ రికార్డుగా మారుతుందని అసలు ఊహించలేమని చెప్పారు. మా పాప సాధించిన ఈ ఘనతను చూస్తుంటే తల్లిదండ్రులుగా మా ఆనందానికి అవధులు లేవని చెబుతున్నారు. ఇది మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకమని ఆనందం వ్యక్తం చేశారు.

పసికూన ప్రతిభకు అరుదైన గుర్తింపు

సువిక్ష నందన ప్రదర్శించిన తల నియంత్రణ, మెడ బలం, సమతుల్యత, శరీర సమన్వయం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం రికార్డు సంస్థ ఈ ఘనతను అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా చిన్నారికి రికార్డు సర్టిఫికెట్, రికార్డ్ హోల్డర్ గుర్తింపు, మెడల్, ప్రత్యేక అవార్డు అందించారు.

మెదక్ జిల్లాకు గర్వకారణం

సువిక్ష నందన అరుదైన ఘనత సాధించడంపై కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. పసి వయసులోనే రికార్డు సాధించిన సువిక్ష భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామంతో పాటు, మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు