ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలి

26-10-2026 | 10:02pm

ఏఐసీసీ పరిశీలకుడు మోహన్ కుమార్ మంగళం డిమాండ్

మేడ్చల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపు పై సమగ్ర విచారణ జరపాలని ఏఐసీసీ పరిశీలకుడు రంగరాజన్ మోహన్ కుమార మంగళం(AICC observer Rangarajan Mohan Kumara Mangalam) డిమాండ్ చేశారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ కోఆర్డినేటర్ అప్సర్ యూసఫ్ జాహీతో కలిసి ఆయన మాట్లాడారు.

ఓటు చోరీ అనేది కేవలం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించిన విస్తృత అంశమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు దక్కడం, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగడం ప్రజాస్వా మ్యాన్ని అత్యంత కీలకమన్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేపడుతున్న ఓటు బచావో దేశ బచావో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు చోరీ సమస్య ఇప్పటిది కాదని, 2018లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఏడు లక్షల ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లోనూ ఓటు చోరీ జరిగిందని, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అనుమానాస్పద నమోదులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల జాబితాల్లో పేర్ల చేర్పులు, తొలగింపులు, అనుమానాస్పద నమోదులు, ఎన్నికలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండటం, ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరు వంటి అంశాలపై సమగ్ర పరిశీలన అవసరమని పేర్కొన్నారు.మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య పెరుగుదలపై కాంగ్రెస్‌ లేవనెత్తిన ప్రశ్నలు, కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో ఓటర్ల నమోదుపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఎన్నికల డేటా విశ్వసనీయతపై చర్చకు దారితీసిందని అన్నారు. ఓటర్ల జాబితాల్లోని అనుమానాస్పద నమోదులను గుర్తించి, వాటిని స్వతంత్రంగా ధ్రువీకరించుకునే అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తుందన్నారు.

జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు వజ్రేష్ పిలుపు

నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు కాపాడటం లక్ష్యంగా కాంగ్రెస్ చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు భూపతి రెడ్డి, బాల్ రెడ్డి,మహేష్ కుమార్ గౌడ్, యూ.సత్యనారాయణ, నవీన్ రెడ్డి, సురేందర్ ముదిరాజ్,రాజేష్,శంకర్ గౌడ్, తుంకి రమేష్, విజయ్ రెడ్డి,రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు