అనురాగ్ లో హెచ్‌ఎంఏ స్టూడెంట్ చాప్టర్ ప్రారంభం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University) స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బీబీఏ, ఎంబీఏ విద్యార్థుల కోసం హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ స్టూడెంట్ చాప్టర్(HMA Student Chapter)ను ప్రారంభించారు. ఈసందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఎంఏ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ వి. విష్ణు వందన మాట్లాడుతూ... హెచ్‌ఎంఏ ప్రాధాన్యతను, విద్యార్థులు, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ కోసం నిర్వహించే వివిధ కార్యక్రమాలను వివరించారు.
హెచ్‌ఎంఏ అధ్యక్షుడు శరత్ చంద్ర మాట్లాడుతూ సంస్థాగత అభివృద్ధితో పాటు విద్యార్థులకు అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాల గురించి వివరించారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్, పరిశ్రమ అనుభవం, భవిష్యత్ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. హెచ్‌ఎంఏ కార్యదర్శి రమేష్ లక్ష్మణన్ కూడా ప్రసంగించారు. ఈకార్యక్రమానికి హెచ్‌ఎంఏ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి. ప్రసన్న, కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ సి. మల్లేశ్, జి. శ్రీవాణి తదితరులు హాజరయ్యారు.