ఘట్ కేసర్ లో గుండెను పిండేసే విషాదం

02-11-2026 | 11:17pm
  1. అనారోగ్యంతో యువ నాయకుడు కుసపట్టి పద్మారావు మరణం 
  2. మృతదేహాన్ని వైద్య విద్య పరిశోధనల కోసం బీబీనగర్ ఎయిమ్స్ కు దానం

ఘట్ కేసర్, నవంబర్ 2 (విజయక్రాంతి) : ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలిగిన మంచి మనసున్న వ్యక్తి యువ నాయకుడు కుసపట్టి పద్మారావు(Young leader Kusapatti Padmarao) అనారోగ్యంతో సోమవారం ఉదయం మరణించారు. ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలిచే గుణం, చూసే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సౌమ్య స్వభావం ఆయన సొంతం. చుట్టూ ఉన్నవారికి ఎల్లప్పుడూ ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు.

ఘట్ కేసర్ పట్టణానికి చెందిన పద్మారావు బహుజన సమాజ్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం నాయకుడిగా కొంతకాలం పని చేశారు. అంబేద్కర్ రిస్టుగా బౌద్ధమతంగా సమాజ సేవకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును, ఎందరో ఆత్మీయుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి మంచి వ్యక్తి ఇంత చిన్న వయసులోనే మనల్ని విడిచి వెళ్లిపోవడం మాటల్లో చెప్పలేని తీరని లోటని పద్మారావు పార్థివదేహం వద్ద నివాళులర్పించిన పలువురు ఆయా రాజకీయ పార్టీల నాయకులు పేర్కొన్నారు.

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పంచిన ఆప్యాయత, చెరగని చిరునవ్వు, ఆయన మంచితనం మన గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తీవ్ర దుఃఖంతో, భారమైన హృదయంతో కుటుంబ సభ్యులు

మాకుటుంబ నిర్ణయం మేరకు అతని అంబేద్కరిస్టు బౌద్ధ విలువలకు అనుగుణంగా, మేము సాంప్రదాయ అంత్యక్రియలను నిర్వహించకూడదని నిర్ణయించామని అందుకు బదులుగా అతని భౌతికకాయాన్ని బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కు దానం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా అది వైద్య విద్య, శాస్త్రీయ పరిశోధన, మానవ సేవకు ఉపయోగపడుతుందని, అతను మరణించిన తర్వాత కూడా భవిష్యత్ తరాల వైద్యులు, పరిశోధకులకు సహాయం చేయడం ద్వారా సమాజానికి సేవ చేస్తూనే ఉంటాడని మేము నమ్ముతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు