అనురాగ్లో బిల్డథాన్ 2.0 ఇంజినీర్స్ డే వేడుకలు
ఘట్ కేసర్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం, అదానీ సిమెంట్ సహకారంతో ఇంజినీర్స్ డే(Engineers' Day) వేడుకల్లో భాగంగా బిల్డథాన్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మోడల్ ఎక్స్‌పో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు సివిల్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగానికి సంబంధించిన వినూత్న నమూనాలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు.
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పల్లవి బద్రి, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ కుమార్, డీన్–ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎం. ముత్తారెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి, సీఈఓ ఎస్. నీలిమ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంజినీరింగ్ విద్యలో ఆవిష్కరణలు, ప్రాక్టికల్ లెర్నింగ్ మరియు పరిశ్రమ–విద్యాసంస్థల సహకారం ప్రాధాన్యతను వారు వివరించారు.