యూపీలో స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రక్కు

24-11-2026 | 12:43pm

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. పిక్నిక్‌కు వెళ్లి తిరిగి వస్తున్న స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు (Truck) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. కన్నౌజ్ జిల్లా థాథియా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పిక్నిక్ ముగించుకుని వస్తున్న స్కూల్ బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై నిలిచి ఉంది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ట్రక్కు ఢీకొట్టిన తీవ్రతకు బస్సులోని పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు చిన్నారులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 35 మందికి గాయాలయ్యాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు (Rescue Operations) చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం తిర్వా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు (Investigation) చేస్తున్నారు.

మరిన్ని వార్తలు