డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో(Bangladeshi politics) మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా(Awami League leader Sheikh Hasina) స్వదేశానికి తిరిగొచ్చేందుకు తేదీ ప్రకటించారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విజయ దినోత్సవం(Bangladesh Victory Day) సందర్భంగా ఢాకాకు చేరుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రతినిధి సయ్యద్ మొజమ్మిల్ అలీ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఢాకాకు వెళ్లేందుకు ప్రభుత్వ విమానాన్ని ఏర్పాటు చేయాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
2024 ఆగస్టు 5న విద్యార్థుల ఆందోళనలతో ప్రభుత్వం కూలిపోవడంతో హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే ఉంటున్నారు. తాజాగా కొత్త పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. డిసెంబర్ 16న తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ తేదీకి బంగ్లాదేశ్ విముక్తి దినోత్సవంతో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
మరోవైపు హసీనా రాకను బంగ్లాదేశ్ ప్రభుత్వం(Government of Bangladesh) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆమెపై ఉన్న మరణశిక్ష తీర్పు నేపథ్యంలో భారత్ నుంచి అప్పగింత ప్రక్రియ ద్వారానే స్వదేశానికి రావాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ప్రభుత్వ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
2024లో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో జరిగిన హింసకు సంబంధించి హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గతేడాది నవంబరులో ఆమె గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హసీనా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పార్టీ అవామీ లీగ్ రాజకీయ కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హసీనా తిరుగు ప్రయాణ ప్రకటన బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.