గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
రూ.99 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రారంభం
వెంకటాపూర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి(Development of Villages) అవసరమైన నిధులు కేటాయిస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం(Government) కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు.
గురువారం మండల కేంద్రంలో రూ.99 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ముందుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ శ్రీనివాస్‌తో పాటు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీఆర్ఆర్ నిధుల నుంచి రూ.54 లక్షలతో సీసీ రోడ్లు, సీఆర్ఆర్ నిధుల నుంచి రూ.45 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులు మొత్తం రూ.99 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గతంలో కాలనీలో పర్యటించినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు, స్థానిక సర్పంచ్, నాయకుల సూచనలు, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు సహా ప్రతి ఒక్కరూ నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.