సోలార్ ప్లాంట్లు ప్రారంభించిన సీతక్క
ములుగు,(విజయక్రాంతి): ములుగు మండలం జగ్గంపేట(Jaggampeta) గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం(Prime Minister Surya Ghar Free Electricity Scheme) కింద రెండు గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) సోమవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆమె ఈ ప్లాంట్లను ప్రారంభించారు. రెండు గృహాలపై ఒక్కొక్కటి 2 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం 2026–27 నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన శ్రీ సీతారాముల గ్రామ సమాఖ్య భవనాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ భిక్షపతి, జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి, అదనపు పీడీ శ్రీనివాస్, డీపీఎం, ఏపీఎం, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.