పర్యాటక రంగ అభివృద్ధికి మరింత కృషి
జిల్లా పర్యాటక రంగంలో చేరనున్న మరో మణిహారం
జంగాలపల్లి గుట్టను టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసేందుకు పరిశీలన.
రామప్పలో 13 కోట్లతో ఐలాండ్ అభివృద్ధి.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu district)లోని జంగాల్‌పల్లి గుట్టను టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. శుక్రవారం ములుగు నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని తన స్టేట్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులు, పర్యాటక అభివృద్ధి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గ్రామీణ ఉపాధి, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్వరమే ప్రారంభించి, కొనుగోళ్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అటవీ అనుమతుల కారణంగా ముందుకు సాగని మారుమూల గ్రామాల రహదారి పనులపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమన్వయంతో జిల్లా స్థాయి కమిటీ ద్వారా అనుమతుల ప్రక్రియను చేపట్టాలని సూచించారు.
పంచాయతీరాజ్ శాఖ, ఐటీడీఏ ద్వారా ఇప్పటికే మంజూరైన రహదారి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి సీతక్క మాట్లాడుతూ గత రెండు రోజులుగా ములుగు జిల్లాలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు జిల్లా అభివృద్ధిపై సమీక్షించినట్లు తెలిపారు. జంగాలపల్లి గుట్టకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తాము సందర్శించిన టేబుల్ మౌంటెన్‌ను పోలిన ఆకృతి ఉందని వివరించారు. గుట్టపై నుంచి ఒకవైపు లక్నవరం, మరోవైపు రామప్ప కనిపించే మంచి వ్యూ పాయింట్ ఉన్నందున పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ఆర్కిటెక్ట్‌లు, ఇతర నిపుణులను ఆహ్వానించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. రామప్పలో 13 కోట్లతో ఐలాండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్త డిజైన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. జిల్లాలో వెలుగులోకి వస్తున్న గుహలు, గుట్టలు, కోటలు, పురాతన ఆలయాలను పరిరక్షిస్తామని పేర్కొన్నారు. పాత కట్టడాలకు భంగం కలగకుండా కొత్త నిర్మాణాలు చేపడతామని చెప్పారు. గ్రామ సమగ్ర ప్రణాళికలో భాగంగా పనుల పురోగతి తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
పనులకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా వాటి స్థితిని పరిశీలించే అవకాశం ఉంటుందన్నారు. ఏ గ్రామానికి ఏ పనులు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి, మిగిలిన పనులు ఎందుకు పూర్తి కాలేదనే వివరాలను తాను, సంబంధిత కార్యదర్శి, కమిషనర్ నేరుగా తెలుసుకొని అధికారులతో మాట్లాడేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవడంతోపాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేందుకు ఉపాధి హామీ పథకంలో 375 రకాల పనులు చేపట్టవచ్చని వివరించారు.
వీవో భవనాలు, జిపి భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, గ్రంథాలయాలు, పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, వివాహ కార్యక్రమాల కోసం 15 లక్షలతో భవనాలు నిర్మించుకోవచ్చని తెలిపారు. చెరువుల్లో పూడికతీత, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు రహదారులు వంటి పనులు చేపట్టవచ్చన్నారు. బీటీ రహదారులను కూడా 1,000 నుంచి 1,500 కోట్లతో చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ కార్డులతో పని దినాలు పెంచే కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, టూరిజం నోడల్ అధికారి ధర్మ నాయక్, డీఆర్‌డీఓ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.