విధుల్లోనే ఆర్టీసీ కండక్టర్‌కు అస్వస్థత
ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో తప్పిన ప్రాణాపాయం
కల్వకుర్తి: కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ అనిత ఆదివారం అస్వస్థతకు గురై బస్సులోనే పడిపోయారు. దేవరకొండకు(Devarakonda) వెళ్లి తిరిగి కల్వకుర్తికి వస్తుండగా చారకొండ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కండక్టర్(RTC Conductor) ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోవడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ బస్సును నేరుగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రక్తపోటు తక్కువ కావడంతోనే ఆమె అస్వస్థతకు గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.






