హామీలు ఎక్కడ.. అరెస్టులు ఎందుకు?
వెంకటాపూర్, నవంబర్ 05 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి బైండోవర్(Bind over) చేయడం అప్రజాస్వామికమని జిల్లా ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య(Chanti Bhadraiah) విమర్శించారు. గురువారం మండలానికి చెందిన పలువురు ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్సై చల్లా రాజు ఎదుట బైండోవర్ చేశారు.
ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా, ప్రశ్నించే వారిని అరెస్టు చేయించడం సరైన విధానం కాదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పోరాటం చేశారని గుర్తుచేశారు. అలాంటి వారిపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో మండల జేఏసీ కన్వీనర్ నరేడ్ల వేణు, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్ర భద్రయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ జహీర్ పాషా ఉన్నారు.