ఆర్డీవో కార్యాలయంలో షాదీ ముబారక్ ఫైల్స్ మిస్సింగ్..!

03-10-2026 | 04:21pm

- అధికారుల అలసత్వం.

- కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్‌ ఆర్డీవో కార్యాలయం(Nagarkurnool RDO Office)లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తుల నిర్వహణలో అధికారుల అలసత్వం బయటపడింది. రెండేళ్ల క్రితం వివాహాలు జరిగిన లబ్ధిదారుల దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉండటంతో బాధితులు కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి ఆర్డీవో కార్యాలయానికి పంపిన దరఖాస్తులను అక్కడ రిసీవ్‌ చేసుకున్నప్పటికీ, కొన్ని ఫైల్స్‌ కనిపించకుండా పోయినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

ఫైళ్ల పరిస్థితిపై అధికారులను ప్రశ్నిస్తే.. మళ్లీ దరఖాస్తు ఫైళ్లు సిద్ధం చేసుకుని రావాలని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌ కాలనీకి చెందిన గౌస్‌పాషా తన సోదరి వివాహం జరిగి రెండేళ్లు కావస్తున్నా షాదీ ముబారక్‌ దరఖాస్తు(Shaadi Mubarak Application) ముందుకు సాగడం లేదని వాపోయారు. ఆర్డీవో కార్యాలయంలో ఫైల్ మిస్ అయింది అంటూ చెప్తున్నారని ఆరోపించారు.

పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇలా కార్యాలయాల చుట్టూ తిప్పడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఫైళ్ల మిస్సింగ్‌పై అధికారులు స్పష్టత ఇవ్వడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు త్వరగా పథకం ప్రయోజనం అందించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్డిఓ అర్చన వివరణ ఇస్తూ విచారించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు