తిరంగా ర్యాలీ.. పోలీసుల కట్టడి
- ‘కాక్రోచ్’ మార్చ్‌కు అనుమతి నిరాకరణ
- అభిజీత్ దీప్కే, నేహా బోరా సహా 200 మంది అరెస్ట్
- ఢిల్లీ కరోల్‌బాగ్, కన్నాట్ ప్లేస్‌లో ఉద్రిక్తత
- అంతకుముందు ఇంట్లో సీజేపీ చీఫ్‌కు నోటీసులు
- ప్రజలను సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారని ఆరోపణ
- జోకులు వేసేకంటే తనను ఉరితీయాలని దీప్కే వ్యాఖ్య
- ర్యాలీకి మద్దతుగా జాతీయ జెండాలతో ఆప్, సీపీఎం కార్యకర్తలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఢిల్లీ(Delhi)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శుక్రవారం చేపట్టిన తిరంగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ కోసం బయలుదేరిన సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే(CJP chief Abhijeet Dipke), ఏఐఎస్ఏ ప్రెసిడెంట్ నేహా బోరా సహా దాదాపు 200 మందిని అరెస్ట్ చేశారు. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ చేపట్టాలని సీజేపీ పిలుపునివ్వగా.. అక్కడ వేలసం ఖ్యలో పోలీసులు మోహరించారు. దీప్కేను అరెస్ట్ చేసి తరలిస్తుండగా.. మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ సెంట్రల్ పార్క్ పరిసరాల్లోకి జాతీయ జెండాలతో భారీగా తరలివచ్చి నినాదాలు చేశారు.
దీప్కే ఇంట్లోకి వెళ్లి నోటీసులు..
తిరంగా ర్యాలీ కోసం అభిజిత్ దీప్కే కరోల్ బాగ్‌లోని ఓ అపార్ట్మెంట్లో బస చేశారు. అక్కడికి శుక్రవారం ఉదయమే పోలీసులు చేరుకున్నారు. మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్లి.. దీప్కేకు రెండు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఇది చట్టవిరుద్ధమంటూ ఓ నోటీసులో ప్రస్తావించారు. పైగా, ఇటీవల కోర్టు కూడా ఏడాది పాటు శాంతికి భంగం కలిగించకూడదంటూ హెచ్చరించిన విషయాన్ని అందులో గుర్తుచేశారు. సెంట్రల్ పార్క్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, అక్కడికి వెళ్లకూడదని మరో నోటీసు ఇచ్చారు. వీటిపై దీప్కే స్పందిస్తూ.. ‘మీ తీరును చూస్తే నవ్వొస్తున్నది. సోషల్ మీడియాలో నేను పెట్టిన పోస్టుల్లో, వీడియోల్లో ఎక్కడైనా హింసను ప్రేరేపించేలా ఉన్నాయా? చూపించండి. మీరు జోక్‌లు వేయడం కంటే.. నన్ను ఉరితీయండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుచరులతో బయలుదేరగా..!
కరోల్ బాగ్‌లోని ఇంటి నుంచి కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు ర్యాలీలో పాల్గొనేందుకు అనుచరులతో కలిసి అభిజీత్ దీప్కే బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని తేల్చిచెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా రెండు రోజులపాటు సెంట్రల్ పార్క్ ను మూసివేశామని గుర్తుచేశారు. పైగా, నిరసన ర్యాలీలపై అక్కడి వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాన్నీ ప్రస్తావించారు. దీప్కేను అదుపులోకి తీసుకొని వాహనం ఎక్కించారు. ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.
ఏ చట్టాన్ని తాను ఉల్లంఘించానని అదుపులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీప్కేను అరెస్టు చేయ డం వారంలో ఇది రెండోసారి. ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనేందుకు ముంబై నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకోగా.. ఎయిర్‌పోర్టులోనే విమానంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సెంట్రల్ పార్క్‌లో తిరంగా ర్యాలీ జరగాల్సి ఉండగా.. అంత కు ముందే దీప్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వాహనం ఎక్కిస్తుండగా అనుచరులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
నేహా బోరా కూడా..!
సెంట్రల్ పార్క్‌లో తిరంగా ర్యాలీలో పా ల్గొనేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ప్రెసిడెంట్ నేహా బోరా తన అనుచరులతో జాతీయ జెండాలతో మండీహౌస్ ముందు గుమిగూడారు. వామపక్ష పార్టీల, అనుబంధ సంఘాల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సెంట్రల్ పార్క్ దిశగా నేహా బోరా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లనీయలేదు. ఆమెతోపాటు పలువురిని పోలీ సులు అరెస్ట్ చేశారు.
సెంట్రల్ పార్క్ చుట్టూ ఉద్రిక్తత..
కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ పరిసరాల్లో శుక్రవారం ఉదయం నుంచే ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ పార్క్‌ను రెం డు రోజుల పాటు బంద్ పెడుతున్నామని, పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, ఎవరూ ఇటుగా రావొద్దని గురువా రమే పోలీసులు ప్రకటించారు. అయినా.. సాయంత్రం 5 గంటలకు సీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టేందుకు పోలీసు ల కండ్లు గప్పి యువత అక్కడికి చేరుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ రాయ్, సీపీ ఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ సహా ఆయా పార్టీల కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అక్కడి పరిసరాల్లో జాతీయ జెండాతో సీజేపీ మద్దతుదారులు కలియతిరిగారు. పార్క్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి ప్రవేశించాలనుకున్నవాళ్లను అదుపులో కి తీసుకున్నారు. దాదాపు 200 మందిని అరెస్ట్ చేశారు.
భయపడుతున్న కేంద్రం: సీజేపీ
శాంతియుతంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తామన్నా కేంద్ర ప్రభుత్వం భయపడిపో తు న్నదని కాక్రోచ్ జనతా పార్టీ దుయ్యబట్టింది. దీప్కే సహా తమ ప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ పో స్ట్ పెట్టింది. ‘నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. యువశక్తికి ప్రభుత్వం ఎం తలా భయపడుతున్నదో తాజా అరెస్టులే ని దర్శనం’ అని అందులో పేర్కొంది. అయి తే.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, మరో ఇద్ద రు కీలక ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతో ష్ రంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉండటం తో ‘కాక్రోచ్’ల వ్యూహం ఏమిటన్నది చర్చనీయాంశమైంది. కీలక నేతలు తమతో లేకపోయినా ప్లాన్ బీ అమలు చేస్తామంటూ సోష ల్ మీడియా వేదికగా సీజేపీ పోస్టులు పెట్టింది.
నియంతృత్వానికి నిదర్శనం : కేజ్రీవాల్
కేంద్రంలోని మోదీ సర్కార్ నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నదని, దీనికి నిదర్శనమే దీప్కే అరెస్ట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. నియంతృత్వం నడువదని హెచ్చరించారు. జాతీయ జెండాను ఎగురవేయడం నేరమా? అని ప్ర శ్నించారు. తిరంగా ర్యాలీని ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. యువతను చూసి మోదీ భయపడుతున్నారని ఆయన ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు.
అప్రకటిత ఎమర్జెన్సీ: మమత
దేశంలో మోదీ ప్రభుత్వం అప్రకటిత ఎ మర్జెన్సీని అమలు చేస్తున్నదని, దీప్కే అరెస్ట్ ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీ ఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు. ‘మొ న్న సౌరవ్ దాస్, అశుతోష్ రంకా.. ఇప్పుడు దీప్కే.. ఇలా ఎంత మందిని అరెస్ట్ చేస్తారు. వాళ్లు దేశ యువత ధైర్యానికి ప్రతినిధులు. అరెస్టులను ఖండిస్తున్నాం. యువతకు దీదీ గా నేను అండగా ఉంటా’ అని ‘ఎక్స్’లో పో స్ట్ చేశారు.
జెండానూ మోదీ ద్వేషిస్తున్నారు: ధృవ్ రాఠీ
ఇన్నాళ్లూ దేశ ప్రజల మీద మోదీ ద్వే షాన్ని చూపించారని, ఇప్పుడు జాతీయ జెం డా మీద కూడా ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ దుయ్యబట్టారు. జాతీయ జెండాను ఎగురవేస్తామం టే ఎందుకంత భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
మా పొట్ట కొట్టొద్దు
మీ నిరసనలతో వ్యాపారాలు దెబ్బతీయొద్దు
కన్నాట్ ప్లేస్‌లో వ్యాపారుల ఆందోళన
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కన్నాట్ ప్లేస్ లో సీజేపీ నిరసన ర్యాలీకి పిలుపునివ్వ డం, అక్కడి ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో స్థానిక వ్యా పారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. తమ పొట్ట కొట్టొద్దని సీజేపీ ప్రతినిధులకు సూచించారు. నిరసనలకు వేరే ప్రాంతాన్ని ఎన్నుకోవాలని, ప్రస్తుతం పం డుగల సీజన్ అని, ఇలాంటి టైమ్‌లో నిరసనలు తెలిపితే తామంతా రోడ్డుమీద పడుతామని ఆందోళన వ్యక్తం చేశారు. అటు తిరంగా ర్యాలీకి సీజేపీ సిద్ధమవగా.. ఇటు వ్యాపారాలు కన్నాట్ ప్లేస్‌లో గుమిగూడి, కేంద్ర ప్రభుత్వానికి, పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేశారు. సీజేపీ తీరును దుయ్యబట్టారు. కన్నాట్ ప్లేస్‌లో రోజూ రూ. 200 కోట్ల బిజినెస్ నడుస్తుందని, పదిరోజుల నుంచి నిరసనలు, ధర్నాల వల్ల బిజినెస్ పూర్తిగా దెబ్బతిందని వాపోయారు.