బంగ్లాదేశ్ తరహా హింసకు కుట్ర
- ఎన్నికల్లో గెలవలేకనే రాహుల్ గాంధీ దేశవ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు
- రాజ్యాంగ పుస్తకం పట్టుకొని.. రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వీర్యానికి కృషి
- ప్రశాంత్ భూషణ్, నేహా బోరా, అభిజీత్ దీప్కే విద్రోహ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): బంగ్లాదేశ్ పరిణామాల నుంచి తాము ప్రేరణ పొంది, భారతదేశంలో కూడా అదే రీతిలో ‘రెజీమ్ చేంజ్’ (పాలన మార్పు) చేస్తామంటూ బాహటంగా మాట్లాడిన మాటలపై కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు(BJP State President N Ramchander Rao) డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ తరహాలోనే దేశంలోనూ అరాచకాన్ని, హింసను సృష్టించడానికి దేశ విద్రోహులతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో కశ్మీర్ సహా పలు జాతీయ అంశాలపై నిరంతరం దేశవ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ విద్యార్థి విభాగమైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియే షన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా, కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) నేత అభిజీత్ దీప్కే ఢిల్లీ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ముమ్మాటికీ దేశద్రోహపూరితమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓవైపు రాజ్యాంగ పుస్తకం చేతపట్టుకొని.. మరోదిక్కు రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని రాహుల్ను ఉద్దేశించి విమర్శించారు.
ప్రశాంత్ భూషణ్, ఐసా, సీజేపీ నేతల దేశద్రోహ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో రాంచందర్రావు మాట్లాడారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగడం, ప్రజాతీర్పు మేరకు ఒక కూటమి గెలవడం, మరొకటి ఓడిపోవడం నిరంతర ప్రజాస్వామ్య ప్రక్రియ అన్నారు. బంగ్లాదేశ్ తరహా విధ్వంసాన్ని, హింసను ప్రేరణగా తీసుకుని భారతదేశంలోనూ పాలన మార్పు తెస్తా మంటూ విద్రోహ శక్తులు ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి దేశవ్యతి రేక నినాదాలు, కుట్రలు జరుగుతుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పుడూ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతూ రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రసంగాలు చేస్తుంటారని, కానీ రాజ్యాంగ విలువలనే కాలరాస్తున్న ఈ శక్తులపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఒకవైపు చేతిలో జాతీయ జెండా పట్టుకుని, మరోవైపు విదేశీ నిధుల అండతో దేశంలో అల్లర్లు, అరాచకం సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను దేశ ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
దేశ ప్రజలకు అత్యంత నమ్మకమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయవ్యవస్థ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) లాంటి సర్వోన్న త సంస్థలను నిర్వీర్యం చేసేందుకు రాహుల్ గాంధీ, అర్బన్ నక్సలైట్లు, ‘టుకుడే- గ్యాంగ్ పక్కా వ్యూహంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. వీరి పోరాటం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్లకు వ్యతిరేకం కాదని, కేవలం అక్రమ మార్గాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే వీరి ఏకైక లక్ష్యమని చెప్పారు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగే ఎన్నికల్లో రాహు ల్ ఎన్నటికీ గెలవలేరని స్పష్టమయ్యాక, దేశంలో అశాంతిని ప్రేరేపించి అధికారం దక్కించుకోవడా నికి కాంగ్రెస్ నేతలు దేశద్రోహ శక్తులతో చేతులు కలిపారని రాంచందర్రావు విమర్శించారు. స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్, నేడు నక్సలైట్ ఆలోచనా విధానా లకు దిగజారి దేశద్రోహుల పక్కన నిలబడటం సిగ్గుచేటన్నారు. ప్రశాంత్ భూషణ్, నేహా బోరా, దీప్కే తదితరుల విద్రోహ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరిని వెంటనే స్పష్టం చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ను కూడా దేశం ఒక దేశద్రోహ పార్టీగానే పరిగణిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హెచ్చరించారు.