కరెంట్ షాక్
- రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు
- 20,003 మెగావాట్ల గరిష్ఠానికి చేరిక
- 334.54 మిలియన్ యూనిట్ల వినియోగం
- హైదరాబాద్‌లోనూ పెరిగిన విద్యుత్ అవసరాలు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుత్(Telangana Electricity) డిమాండ్ డబులై.. సరికొత్త రికార్డు సృష్టించింది. విద్యుత్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరింది. ఈనెల 15న ఉదయం 10.29 గంటలకు ఈ రికార్డు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం గరిష్ఠ డిమాండ్ 18,548 మెగావాట్లతో పోలిస్తే మరో 1,455 మెగావాట్లు పెరిగింది. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియో గం 334.54 మిలియన్ యూనిట్లకు చేరింది.
వ్యవసాయం, గృహావసరాలు, వాణిజ్య సంస్థలు, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెరుగుతున్న అవసరాలు డిమాండ్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ విద్యుత్ అవసరాలు పెరగడంతో పొదుపుగా వాడాలని సీఎండీ జితేష్ వీ పాటిల్ ప్రజలకు శుక్రవారం విజ్ఞప్తిచేశారు. ఈనెల 1 నుంచి 15 వరకు రాష్ట్ర సగటు గరిష్ఠ డిమాండ్ 19,289 మెగావాట్లుగా, రోజువారీ సగటు వినియోగం 321.34 మిలి యన్ యూనిట్లుగా నమోదైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో అక్టోబర్ 15న 12,281 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవగా, రోజువారీ వినియోగం 228.14 మిలియన్ యూనిట్లకు చేరింది.
గత ఏడాది గరిష్ఠ రోజువారీ వినియోగంతో పోలిస్తే 5.80 మిలియన్ యూనిట్లు అధికంగా నమోదయ్యాయి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 15న సాయంత్రం 6.19 గంటలకు 4,220 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. ఈనెల 9న రోజువారీ వినియోగం 88.22 మిలియన్ యూనిట్లకు చేరింది. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 3,552 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో పాటు ఏసీలు, ఇతర శీతలీకరణ పరికరాల వినియోగం పెరగడం కూడా దీనికి కారణమవుతోంది.
పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ తెలిపారు. విద్యుత్ కొనుగోలు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు తదితర చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భూగర్భ జలమట్టాలు తగ్గడంతో బోర్లపై ఆధారపడటం, వ్యవసాయ మోటార్ల వినియోగం పెరగడం విద్యుత్ డిమా్ంప అదనపు ఒత్తిడి పెంచుతున్నాయన్నారు. అవసరం లేనప్పుడు విద్యుత్ పరికరాలను ఆపివేయాలని, విద్యుత్‌తో పాటు నీటినీ పొదుపుగా వినియోగించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ విద్యుత్ సరఫరా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు ‘అధికారులు పొలం బాట’ కార్యక్రమాన్ని చేపట్టారు.
గతవారం రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ విద్యుత్ సరఫరా, భూగర్భ జలమట్టాలు, బోర్లలో నీటి లభ్యత, మోటార్ల పనితీరు, పంటల పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సర్వీస్ వైర్లు, తక్కువ వోల్టేజీ సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. సాగునీటి అవసరాల సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సీఎండీ ఆదేశించారు. రికార్డు స్థాయి డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో కృషి చేస్తున్న ఇంజినీర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆయన అభినందించారు.