విచారణకు సై
- సిట్టింగ్ జడ్జీతో జరిపించాలి
- పదవి నిలుపుకునేందుకే విదేశీ బొగ్గు కమీషన్లకు కుట్ర
- సింగరేణి, విద్యుత్, సాగునీటి సంక్షోభాలకు కాంగ్రెస్
- ప్రభుత్వమే కారణం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): సింగరేణి కుంభకోణాలు, ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సవాల్ విసిరారు. సింగరేణిలో కుంభకోణాలు జరుగుతున్నాయని తాము చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా సీఎం రేవం త్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీఎం హయాంలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అక్రమాలపై కూడా న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహిం చిన నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణి, విద్యుత్, సాగునీటి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
సింగరేణిలో జరుగుతున్నట్లు తాము ఆరోపిస్తున్న కుంభకోణాలను ప్రజల ముందు పెడితే రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. తాను ఉత్తరం రాస్తే విచారణకు ఆదేశిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం కాదని, మీడియా ముందు ప్రకటనలు చేయడం కాకుండా వాస్తవంగా విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. సింగరేణిలో తన బామ్మర్ది ప్రమేయంతో జరిగిందని తాము ఆరోపిస్తున్న రూ.10 వేల కోట్ల కుంభకోణంపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న సోలార్ పవర్ కుంభకోణాన్ని కూడా బయటపెడతామని పేర్కొన్నారు.
గతంలో 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణిని బలహీనపరిచి, ఇప్పుడు ఆ సంస్థను పక్కనపెట్టి విదేశీ బొగ్గు కొనుగోళ్లకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిం చారు. ఒకప్పుడు తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరాకు అండగా నిలిచిన సింగరేణినే ఇప్పుడు రేవంత్ రెడ్డి బదనాం చేస్తు న్నారని విమర్శించారు. సింగరేణిలో టన్ను బొగ్గు సుమారు రూ.3,800కు లభిస్తుంటే విదేశాల నుంచి కొనుగోలు చేస్తే టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోళ్ల పేరుతో కమీషన్లు పొందేందుకే ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తు న్నారని ఆరోపించారు. దేశీయంగా సింగరేణిలో బొగ్గు అందుబాటులో ఉన్న దాన్ని ఉ పయోగించుకోకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే విదేశీ బొగ్గు కోసం ప్రయ త్నం చేస్తున్నారన్నారు. సంక్షోభాన్ని ముందు గా సృష్టించి, పరిస్థితి చేయి దాటిన తర్వాత బొగ్గు తెస్తామని, విద్యుత్ కొనుగోలు చేస్తామని సీఎం చెబుతున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ఈఎంఐ సీఎం..
రేవంత్ రెడ్డిని ’ఈఎంఐ ముఖ్యమంత్రి’ అని, కాంగ్రెస్ అధిష్ఠానానికి రాజకీయ ఈఎంఐలు కట్టకపోతే సీఎం పదవి పోతుందనే భయంతోనే విదేశీ బొగ్గు కొనుగోళ్ల వ్యవహారంలో కమీషన్లు సమకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు చెల్లించాల్సిన ఈఎంఐలను వసూలు చేసేందుకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ఉన్నారని, రికవరీ ఏజెంట్ల వ్యవహరిస్తూ కమీషన్లు చెల్లించకపోతే రేవంత్ రెడ్డి పదవిని తొలగించే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. సింగరేణి భుజంపై తుపాకీ పెట్టి టెండర్లు, కమీషన్ల లెక్కలు వేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు 24 గంటల పాటు విద్యుత్ అందించిన తెలంగాణలో ఇప్పుడు కరెంట్ ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
గతంలో ఛత్తీస్‌గఢ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని కూడా కుంభకోణంగా చిత్రీకరించారని గుర్తుచేశారు. అప్పట్లో యూనిట్ విద్యుత్‌ను రూ.3.90కు కొనుగోలు చేస్తే కుంభకోణమని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు యూనిట్‌కు రూ.15 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాలని చూస్తోందని విమర్శించారు. గత విద్యుత్ కొనుగోళ్లపై కుంభకోణం పేరుతో కమిషన్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జల పండగ..
సాగునీరు, కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేదని, సుమారు 1,000 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేసి, ఇప్పుడు ఎల్- నీనోను సాకుగా చూపుతూ చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. ఆరు నెలల ముందే కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి వృథాగా దిగువకు ప్రవహిస్తున్న నీటిని ప్రజలకు, ప్రభుత్వానికి చూపించామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుబాటులో ఉన్న నీరు వృథాగా దిగువకు వెళ్లిపోయిందని, రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, తాగునీరు, సాగునీటి కొరత మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఎల్-నీనో వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
ఎల్-నీనో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు నీటి నిర్వహణలో చర్యలు తీసుకుంటున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జల పండగ చేసుకుంటుంటే తెలంగాణలో మాత్రం కరువు పరిస్థి తులు ఎందుకు ఏర్పడ్డాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు నీటిని తీసుకెళ్లారని, పట్టిసీమ పంపుల ద్వారా సుమారు 400 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారని తెలిపారు.
ఏపీలో వందల కిలోమీటర్ల దూరానికి నీటిని తీసుకెళ్తుంటే, తెలంగాణలో కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్‌నగర్‌కు కూడా నీటిని తీసుకెళ్లలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం కరువు దిశగా వెళ్తోందని, తెలంగాణ నుంచి పారే నీళ్లతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు నిండుతుంటే, మాత్రం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు కూడా కష్టాల్లో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాలను పక్కనపెట్టి రైతుల సమస్యలపై స్పందించాలని, సాగునీరు, తాగునీరు, విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంక్షోభం ఏర్పడిన తర్వాత కారణాలు వెతకడం కాకుండా, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. నర్సంపేట నియోజకవర్గం లో రాబోయే రెండేళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమా లను దగ్గరుండి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులన్నీ సమష్టిగా కృషి చేయా లని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. సింగరేణి పరిరక్షణ, విద్యుత్ సంక్షోభం, సాగునీటి సమస్యలు, రైతుల ఇబ్బందులు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.