పెట్టుబడులతో రండి!
- కర్ణాటక పరిశ్రమలకు తెలంగాణ ఆహ్వానం
- రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక సహకారం విస్తరించాలి
- డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
- సదస్సుకు హాజరై అవకాశాలను పరిశీలించాలని పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu) ఆహ్వానం పలికారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పోటీపడే ప్రాంతాలు కావని, ఒకే విలువ ఆధారిత సరఫరా గొలుసులో భాగస్వాములని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక సహకారాన్ని మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షో’లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు కర్ణాటక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, టెక్ట్స్‌టైల్స్ వంటి రంగాల్లో తెలంగాణ, కర్ణాటక పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. ఇప్పటికే ఈ రంగాల్లో రెండు రాష్ట్రాలకు ప్రత్యేకమైన పారిశ్రామిక సామర్థ్యాలు ఉన్నాయని, పరస్పర సహకారంతో పెట్టుబడుల అవకాశాలను మరింత పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో భాగమని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ సంస్థలతోపాటు దేశీయ పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు ఆకర్షించడమే లక్ష్యమని వివరించారు. తెలంగాణను దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్‌ను రూపొందించిందని తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ లక్ష్యాల సాధనలో పారిశ్రామిక పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే సంస్థలకు గ్లోబల్ సమ్మిట్ ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. బెంగళూరు రోడ్‌షో ద్వారా కర్ణాటక పారిశ్రామిక వర్గాలకు తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను పరిచయం చేయడంతోపాటు, రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిసెంబర్లో హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఈ భాగస్వామ్యాలు మరింత విస్తరించేలా చర్యలు చేపడుతోంది.