మళ్లీ పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్!

17-10-2026 | 05:50am

మహిళా కోటా బిల్లు కూడా..

ఈ నెలలోనే ప్రత్యేక సమావేశాలకు చాన్స్

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: డీలిమిటేషన్(Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం(Indian Government) సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరులో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. బిల్లుల ఆమోదానికి మద్దతు కూడగట్టేందుకు ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయడం, నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు సంబంధించిన ఈ బిల్లులను పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఏప్రిల్ 17న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. లోక్‌సభలో అవసరమైన ప్రత్యేక మెజారిటీ దక్కకపోవడంతో బిల్లులు వీగిపోయాయి. ఆ తర్వాత వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ.. నీట్ పేపర్ లీకేజీ, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనతో సాధ్యం కాలేదు.

ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పలు కీలక రాజకీయ పార్టీల్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ఆ పార్టీలోని పలువురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఆప్ సహా ఇతర పార్టీల నుంచి పలువురు ఎంపీలు బయటకు వచ్చేశారు. వారందరి మద్దతు తప్పకుండా ఉంటుందని బీజేపీ భావిస్తున్నది.

పైగా తమిళనాడులోని డీఎంకేతో పాటు చిన్న పార్టీల మద్దతు పొందేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను కలిపి పెట్టడం ద్వారా సౌత్ రాష్ట్రాలపై కేంద్రం కుట్ర చేస్తున్నదని డీఎంకే సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తమిళనాడులో ఓటమి తర్వాత ఇండీ కూటమికి డీఎంకే దూరంగా ఉంటున్నది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు డీఎంకే ఎంపీలు సెషన్‌కు రాకుంటే చాలన్న కోణంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉన్నప్పటికీ, ఈ బిల్లులకు సంబంధించిన రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల సంఖ్యాబలం (సుమారు 360 స్థానాలు) లేదు. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు, శివసేన(యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార పక్షం వైపు మళ్లడంతో ప్రభుత్వ బలం పెరిగింది. ఇదే క్రమంలో డీఎంకే ఎంపీలు సభకు రాకుంటే.. ఆ మేరకు కలిసి వస్తుందని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటున్నది. కాంగ్రెస్‌తో ఇతర రాష్ట్రాల్లో విభేదించిన చిన్న పార్టీలతో కూడా కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నది. 

పార్లమెంట్‌ను ప్రొరోగ్ చేయలే..

పార్లమెంట్  ప్రత్యేక సమావేశాల తేదీలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ నెల 26, 27 తేదీల్లో పార్లమెంట్ భవన్ (సంవిదాన్ సదన్)లో జరగనున్న బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సెషన్ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కేంద్రం ఇంకా ప్రొరోగ్ చేయలేదు. సాధారణంగా నిరవధిక వాయిదా తర్వాత రెండు మూడురోజల్లో ప్రొరోగ్ ప్రకటిస్తారు. కానీ, ఈసారి రెండు నెలలైనా ప్రకటించలేదు.

ప్రత్యేక సమావేశాల కోసం వారం రోజుల ముందుగా నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదం కోసం స్పెషల్ సెషన్ ఉండొచ్చని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అయితే.. ‘సర్’కు, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కీలక బిల్లుల కోసం కేంద్రం స్పెషల్ సెషన్ పెట్టేందుకు సాహసిస్తుందా?.. అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.  

మరిన్ని వార్తలు