పడగొట్టి చూడు!
- మోదీ సర్కార్‌ను కూల్చే దమ్ముందా రాహుల్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు
- శ్రీలంక మాదిరి ఇక్కడ నడ్వదు
- ప్రపంచ శక్తులు ఏకమైనా ఏమీ చేయలేవు
- ఓట్ల చోరీ జరగలేదు.. దొంగలకు ప్రజలు ఓట్లేస్తలేరు
- రాష్ట్రంలో నిర్బంధాలు.. ఢిల్లీలో రేవంత్ ఉపన్యాసాలా?
- యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు బొగ్గు కేటాయిస్తామని హామీ
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ‘రాహుల్ గాంధీ.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాదరణతో ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూడు’ అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) తీవ్రంగా హెచ్చరించారు. శ్రీలంకలో అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చినట్లు మన దేశంలోనూ ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చాలని రాహుల్ గాంధీ దింపుడు కళ్లం ఆశలు పెట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
మోదీకి వ్యతిరేకంగా అంతర్జాతీయ డీప్ స్టేట్ మీడియా, విద్రోహ శక్తుల కుట్ర లు చేస్తున్నాయని.. ప్రపంచ శక్తులు ఏకమైనా మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవ న్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల నిర్వహణ యావత్ ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు. ‘అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ఎన్నికల ప్రక్రియ, కౌం టింగ్ నెలల తరబడి సాగుతుంది. కానీ, మన దేశంలో 140 కోట్ల మంది ప్రజల అభీష్టాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించి ఒక్క రోజులోనే తీర్పు వెల్లడించే అద్భుతమైన స్వతంత్ర వ్యవస్థ ఎన్నికల కమిషన్‌ది.
అలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను దెబ్బతీసేందుకు ఎన్నికల కమిషన్‌పై బురద జల్లేందుకు రాహుల్ గాంధీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు గానీ వ్యవస్థలను నాశనం చేయకూడదన్న ఇంగితం రాహుల్‌కు లేదు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న దేశ ప్రతిష్టను జీర్ణించుకోలేక అంతర్జాతీయ పెట్టుబడిదారీశక్తులు, డీప్ స్టేట్ మీడియా, విదేశీ శక్తులు, దేశీయ విద్రోహ శక్తులు ఏకమై పెద్ద కుట్రకు తెరలేపాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.
‘భారత్ ఎప్పటికీ ప్రపంచం ముందు అప్పుల కోసం చేతులు చాచాలని, తమ కనుసన్నల్లోనే నడవాలని కోరుకునే శక్తులు ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యం గా చేసుకుని ఢిల్లీలో ఒక్క రోజే 10 వేల జీన్స్ ప్యాంట్లు, టీ-షర్టులు విద్యార్థులకు పంపిణీ చేసి అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు పన్నారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఐఎల్ఓ వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ భారతదేశ జీడీపీ వృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని కొనియాడుతుంటే కొందరికి కంటగింపుగా మారింది. ప్రపంచ శక్తులన్నీ ఒక్కటైనా మోదీ ప్రభుత్వాన్ని వెంట్రుక కూడా పీకలేవు’ అని ఆయన తేల్చిచెప్పారు.
రాహుల్.. ఫేక్ ప్రతిపక్ష నేత..
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌ను రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు రాజకీయాలకు, ప్రధానమంత్రులకు అతీతంగా దేశం కోసం శ్రమించిన నిస్వార్థ దేశభక్తుడు అజిత్ దోవల్ అని, ఆయన పేరు చెబితే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని పేర్కొన్నారు. ఒక రాజకీయ నాయకుడిపై మాట్లాడినట్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తే ఈ దేశ యువత రాహుల్ గాంధీని ఎప్పటికీ క్షమించదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఎన్డీయే ప్రభుత్వంలో పోలీసు అధికారులు, సీబీఐ, ఈడీ, విదేశాంగ శాఖల అధికారులు తనకు టచ్‌లో ఉండి సమాచారం లీక్ చేస్తున్నారని రాహుల్ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం.
సాధారణంగా ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు పెంచుకోవడం గౌరవప్రదం. కానీ.. ప్రభుత్వ అధికారులతో మాట్లాడే సంస్కృతి, సోయి రాహుల్ గాంధీకి ఎన్నడూ లేదు. దేశ భద్రత, విదేశాంగ అంశాలు తనకు లీక్ అవుతున్నాయని బహిరంగంగా ప్రచారం చేసుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇంత బాధ్యతారాహిత్యమైన, బలహీనమైన ప్రతిపక్ష నేతను దేశం ఎన్నడూ చూడలేదు. ఆయన ఫేక్ ప్రతిపక్ష నేత’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ ఇంటర్నేషనల్ మేధావి.. ఆయనకు ఇందులో నోబెల్ బహుమతి కూడా వస్తుంది’ అని ఎద్దేవా చేశారు.
ఓట్ల చోరీ ఎక్కడా జరగలేదని, దొంగలకు ప్రజలు ఓట్లు వేయడం లేదనే విషయం రాహుల్ గాంధీ గ్రహించాలని సూచించారు. ముఖ్యమంత్రులు, ఎంపీలు, పదవులు పోయిన నాయకులందరినీ విమానాలు, రైళ్లలో తరలించి సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయమూర్తులను బ్లాక్మెయిల్ చేసేందుకు రాహుల్ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ, బీజేపీ కార్యాలయాల నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధాలు చేస్తూ.. ఢిల్లీకి పోయి రాజ్యాంగ పరిరక్షణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే పెద్ద పెద్ద ఉపన్యాసాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ సంగతి చెప్తాం..
బీజేపీ ఇంకా ఆట మొదలు పెట్టలేదని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సంగతి చెప్తామని, ముందుంది ముసళ్ల పండుగని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. పథకాలకు నిధులు కేటాయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసే సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ఎందుకు చెల్లించడం లేదని ఆయన నిలదీశారు. సింగరేణి సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని తెలిపారు. తాను బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన తర్వాత సింగరేణికి కొత్తగా 3 కోల్ బ్లాక్‌లను కేటాయించామని, మరో బ్లాక్ కేటాయింపు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు.