పెళ్లికి ముందే ప్రత్యేక శిక్షణ.. అందుకు ఓ కోర్సు

05-11-2026 | 09:21am

గోవా, నవంబర్ 5: చదువు, ఉద్యోగం, కెరీర్ కోసం ప్రత్యేకంగా Preparation తీసుకునే యువత.. జీవితంలో కీలకమైన పెళ్లి విషయంలో మాత్రం తగినంత అవగాహన పెంచుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానంగా గోవాలోని ఓ కాలేజీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివాహ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడంతో పాటు, ఆరోగ్యకరమైన బంధాన్ని నిర్మించుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ‘Marriage Readiness’ పేరుతో ప్రత్యేక Certificate Course ప్రారంభించింది.

గోవా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ‘Marriage Readiness: Preparing for Healthy and Lasting Relationships’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం డిసెంబర్ 2 నుంచి 17 వరకు 15 రోజుల పాటు కొనసాగనుంది. కాలేజీలోని Human Development and Family Studies విభాగం ఆధ్వర్యంలో తరగతులు నిర్వహిస్తారు. పెళ్లి అంటే కేవలం వేడుకలు, ఖర్చులు, బంధువుల సందడి మాత్రమే కాదని.. దాంపత్య జీవితాన్ని సజావుగా కొనసాగించేందుకు Emotional Maturity, Mutual Understanding, Trust, Commitment వంటి అంశాలు ఎంతో ముఖ్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కోర్సులో భాగంగా వ్యక్తిగత ఆలోచనలు, భాగస్వామి అభిప్రాయాలను అర్థం చేసుకోవడం, విభేదాలను పరిష్కరించుకోవడం, కుటుంబ బాధ్యతలను పంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందే తమ అంచనాలు, బాధ్యతలపై స్పష్టత తెచ్చుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చని నిర్వాహకుల అభిప్రాయం. గోవాలో విడాకులకు సంబంధించిన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. పెళ్లికి ముందే Counselling అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఇటీవల వెల్లడించారు. రాష్ట్ర న్యాయశాఖ గణాంకాల ప్రకారం 2022 నుంచి 2025 మధ్య సివిల్ కోర్టుల్లో వివాహం, విడాకులకు సంబంధించి 3,000కు పైగా పిటిషన్లు నమోదయ్యాయి. 2024లోనే 947 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పరిస్థితుల్లో వివాహానికి ముందే అవగాహన కల్పించే ప్రయత్నాలు సంబంధాల బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడతాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు