రాంకీ సంస్థ ఇష్టారాజ్యం
- జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణలో నిబంధనలకుపాతర
- చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కాల్చివేత
- రాత్రి, పగలు తేడా లేకుండా చెత్తకుప్పలకు నిప్పు
- స్థానికులకు శ్వాసకోస ఇబ్బందులు
- పట్టించుకోని అధికారులు
మేడ్చల్, నవంబర్ 4 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) నిర్వహణలో రాంకీ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలను పాటించడకుండా టన్నులకొద్దీ పేరుకుపోతున్న చెత్తను శాస్త్రీయంగా నిర్వహించి, చెత్తను వేరు చేసి తడి చెత్తతో ఎరువు, పొడి చెత్త(Dry waste) తో విద్యుత్ ఉత్పత్తి(Electricity Generation) చేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా చెత్తను కాల్చి వేస్తోంది. రాత్రి వేళల్లో, కొన్ని సందర్భాల్లో పగటిపూట కూడా చెత్తకుప్పలకు నిప్పు పెడుతున్నారు.
దీని నుంచి విలువడే విషపూరిత పొగ(Toxic smoke) చుట్టుపక్కల వ్యాపించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న జవహర్‌నగర్ పద్మగూడ, నాగారం ప్రాంతాల్లో దుర్వాసన, పొగతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. పిల్లలు, వృద్ధులకు శ్వాసకోస వ్యాధులు, చర్మవ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. బోరు బావుల్లో నీరు రంగు మారి వస్తుండటంతో వినియోగించడం లేదని తెలిపారు.
పట్టించుకోని అధికారులు
రాంకీ సంస్థ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కాల్చివేసి పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, పర్యావరణ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్చివేతను వెంటనే ఆపి, విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపాలని, డంపింగ్ యార్డ్ నిర్వహణపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్‌లో చెత్తను బహిరంగంగా కాల్చడం చట్టరీత్యా నేరమని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు పెట్టాయని పర్యావరణ అభిప్రాయపడుతున్నారు.
వ్యర్థాల నిర్వహణ నిబంధనలు ఇలా..
చెత్తను బహిరంగ ప్రదేశంలో కాల్చడం, ముంచడం పూర్తిగా నిషేధం. చెత్తను కాల్చిన, కాల్చడానికి అనుమతి ఇచ్చిన స్థానిక సంస్థ (జిహెచ్‌ఎంసి) బాధ్యత వహించాల్సి ఉంటుంది. చెత్తను మొదట తడి చెత్త, పొడి చెత్త, ప్రమాద వ్యర్ధాలుగా వేరు చేయాలి. తడి చెత్తతో కంపోస్ట్, బయోగ్యాస్, పొడి చెత్తతో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కాల్చి వేయడం నిషేధం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లో శాస్త్రీయ దహన యంత్రాలతో 850 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కాల్చాలి.
పొగను ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసి వదలాలి. డైయాక్సిన్, ఫ్యూరాన్ లాంటి విషవాయువులు బయటకు రాకూడదు. బహిరంగ చెత్త కాల్చడం వాయు కాలుష్యం కిందకు వస్తుంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవచ్చు. 2016లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దేశవ్యాప్తంగా చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో రామ్కీ సమస్త ఎన్జీటీ ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది.