దాడుల కల్చర్ మీదే..
- కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
- ట్విట్టర్ టిల్లు అంటూ ఘాటు విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): ‘ట్విట్టర్ టిల్లు(Twitter Tillu).. మీది మేనేజ్ మెంట్ కోటా(Management Quota), మాది మెరిట్ కోటా’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను(KTR) ఉద్దేశించి కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘాటుగా విమర్శించారు. అమిత్ షా పర్యటన(Amit Shah's visit) నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బుధవారం బండి సంజయ్ కౌంటర్‌గా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అయ్యపేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చి పదవులు సంపాదించుకున్న చరిత్ర మీది. మేం కష్టపడి జనం కోసం లాఠీదెబ్బలు తిని, ఉద్యమాలు చేసి కార్యకర్త స్థాయి నుండి ఈస్థాయికి వచ్చాం.
అమిత్ షా పాదయాత్రకు విపరీతమైన కార్యకర్తలు, జనం వస్తే కంట్రోల్ చేయడానికి నేను వెళితే బౌన్సర్ అంటూ హేళన చేస్తావా. మా పార్టీకి వచ్చిన క్రౌడ్‌ను క్రమబద్దీకరించడానికి వెళితే బౌన్సర్‌లా కన్పిస్తున్నామా? బౌన్సర్లతో దాడులు చేయించిన కల్చర్ మీదే. అధికారంలో ఉన్నంత కాలం కార్యకర్తలను గాలికొదిలేసిన చరిత్ర మీదే. తెలంగాణ భూములమ్మి దోచుకున్న ఘనత, చరిత్ర బీఆర్‌ఎస్‌దే’ అని తీవ్రంగా స్పందించారు. ఆనాడు ప్రజలకిచ్చిన హామీలన్నీ బీఆర్‌ఎస్ గాలి కొదిలేసిందని, మియాపూర్ భూములను సైతం అడ్డికి పావు శేరమ్మి కేసీఆర్ కుటుం బం దోచుకోవాలనుకుందని రోపించారు.
కాంగ్రెస్ సైతం బీఆర్‌ఎస్ బాటలోనే నడు స్తున్నదని, 6 గ్యారంటీలను గాలికొదిలేసి మియాపూర్ భూములను తెగనమ్మి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు.
మహిళా కండక్టర్ మృతి బాధాకరం..
తోపులాటలో కిందపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మరణించడం అత్యంత బాధాకరమని, కాంగ్రెస్‌పై కోపంతో ఆర్టీసీ కార్మికుల పై పగ తీర్చుకునే ప్రయత్నం చేయొద్దని ప్రయాణికులను కోరారు. ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందుల్లో ఉండి కూడా ఎంతో సేవ చేస్తున్నారని, రిటైరయ్యాక పెన్షన్ కూడా లేని ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులన్నారు. ప్రతిరోజు కోటి మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఘనత ఆర్టీసీ కార్మికులదేనని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓపికతో సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బండి సంజయ్ కోరారు.