SME గ్రోత్ ఫండ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్‌

06-10-2026 | 04:24pm

న్యూఢిల్లీ: చిన్న, మధ్యతరహా సంస్థలకు ఆర్థికంగా మరింత బలం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.10,000 కోట్లతో SME గ్రోత్ ఫండ్(SME Growth Fund) ఏర్పాటుకు ఆమోదం లభించింది.

2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ నిధి ద్వారా వృద్ధి దశలో ఉన్న చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు అందించనున్నారు. కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడం, కొత్త టెక్నాలజీని స్వీకరించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, విదేశీ మార్కెట్లలోకి ప్రవేశించడం వంటి అవసరాలకు ఈ మూలధనం ఉపయోగపడనుంది.

ఈ పథకం కింద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ (Alternative Investment Fund)కు ప్రభుత్వం మొత్తం రూ.10 వేల కోట్లను కేటాయించనుంది. ఇప్పటికే వ్యాపారం నిలదొక్కుకుని, తదుపరి స్థాయికి విస్తరించే సామర్థ్యం ఉన్న సంస్థలకు దీర్ఘకాలిక పెట్టుబడి మద్దతు అందించడం దీని ప్రధాన లక్ష్యం.

తయారీ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం

నిధుల్లో గణనీయమైన భాగాన్ని తయారీ రంగంలోని SMEలకు కేటాయించేలా ప్రణాళిక రూపొందించారు. ఉత్పాదకత పెంపు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఎగుమతుల విస్తరణ, అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

అలాగే టైర్-2, టైర్-3 నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లకు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించే అవకాశం ఉంది. చిన్న నగరాల్లో పరిశ్రమలు విస్తరించడం ద్వారా స్థానిక సరఫరా వ్యవస్థలు బలోపేతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది.

గ్లోబల్‌ స్థాయిలో భారత SMEలు

తయారీ, సేవలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, వ్యూహాత్మక విలువ గొలుసుల్లో ఉన్న సంస్థలను అంతర్జాతీయ పోటీకి సిద్ధం చేయడమే ఈ ఫండ్‌ ప్రధాన ఉద్దేశం. కంపెనీలు విస్తరణ, ఆవిష్కరణలు, కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్‌ ప్రవేశం వంటి కీలక దశల్లో దీర్ఘకాలిక మూలధనాన్ని వినియోగించుకోనున్నాయి.

ఉపాధి, ఎగుమతులు, తయారీ, ఆవిష్కరణల్లో SMEల పాత్రను మరింత పెంచడం, దేశీయ మూలధన మార్కెట్‌ను విస్తరించడం, వికసిత్ భారత్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పారిశ్రామిక వృద్ధికి ఊతమివ్వడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశాలుగా కేంద్రం పేర్కొంది.

మరిన్ని వార్తలు