నిర్వాహకులు స్మార్ట్ అసెస్మెంట్ పోర్టల్ పై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా అదనపు కలెక్టర్ రాములు
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్మార్ట్ అసెస్మెంట్ పోర్టల్ (Center Operators' Smart Assessment Portal)(PCSAP) పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల అధికారి (DSO) వేణుగోపాల్, ఆసిఫాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO) వాజిద్ , ఆసిఫాబాద్ పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ (DM) రజిత, జిల్లా సహకార అధికారి (DCO) కరుణాకర్,
ఎఫ్.సి.ఐ. అధికారి సుఖీష్, సంబంధిత అధికారులతో కలిసి యాప్ వినియోగం, ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఎఫ్.సి.ఐ. అధికారులతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, నిర్ణీత మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలను కొంత ఎత్తైన, చదును ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని, గోనె సంచులను భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, మరుగుదొడ్లు, విద్యుత్, టేబుళ్లు, కుర్చీలు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు తదితర సౌకర్యాలను తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో 2 ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, 30 టార్పాలిన్లు, 1 ప్యాడీ క్లీనర్ అందుబాటులో ఉంచాలని, ప్యాడీ క్లీనర్ అందుబాటులో లేని చోట ట్రాక్టర్ మౌంటెడ్ ఫ్యాన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి వరుస క్రమంలో ధాన్యం కొనుగోలు చేయాలని, రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రైతులు ధాన్యాన్ని తీసుకు వచ్చినప్పుడు తేమ శాతం 17 శాతానికి మించి ఉంటే, ధాన్యాన్ని ఆరబెట్టుకొని తేమ శాతం తగ్గిన తర్వాత తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ధాన్యం విక్రయానికి వచ్చే రైతుల నుంచి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్,
పట్టాదారు పాస్‌బుక్ నకలు ప్రతులను తీసుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ వర్తిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే ముందు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పి.సి.ఎస్.ఎ.పి. యాప్‌లోని 16 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ట్యాబ్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని, ధాన్యానికి సంబంధించిన ఖచ్చితమైన ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని కోరారు.