ఢిల్లీలో నాలుగో రోజు పోరు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు(Delhi Opposition Protest) నాలుగో రోజుకు చేరాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Election Commission SIR Row), ఓట్ల చోరీ ఆరోపణలపై ఇండీ కూటమి నేతలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండీ కూటమి ఎంపీలు(Opposition MPs Rally) సమావేశం కానున్నారు. అనంతరం పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లే అవకాశముంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను తెలియజేయాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే జరిగిన నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, ఇతర ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ నిర్వహించే ప్రయత్నంలో పలువురు నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం విడుదల చేసినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. అక్టోబర్ 8న ఖర్గే ఆధ్వర్యంలో ప్రతిపక్ష ఎంపీలు రాజ్‌ఘాట్ వద్ద మౌన నిరసన చేపట్టారు. ఎన్నికల సంఘం పనితీరుపై తమకు అభ్యంతరాలున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. నేటి సమావేశం అనంతరం ఇండీ కూటమి ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుంది? రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ చేపడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు(Gyanesh Kumar Resignation Demand) వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.