షేమ్.. షేమ్

09-10-2026 | 05:40am
  1. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ట్రస్ట్‌కు భూమి కేటాయింపు.. రద్దు..
  2. కోర్టు చుట్టూ తిరుగుతున్న శాస్త్రిజీ కుమారుడు అనిల్ శాస్త్రి
  3. 2010లో 12 ఎకరాల భూమిని కేటాయించి.. సంస్థకు స్వాధీనం చేసిన అప్పటి ప్రభుత్వం
  4. భూమిని వినియోగించలేదని పేర్కొంటూ 2023లో రద్దు
  5. భూకేటాయింపు రద్దుకు జీవో 38 జారీ
  6. మేనేజ్‌మెంట్‌లో అత్యున్నత విద్యను పొందే అవకాశం కోల్పోతున్న తెలంగాణ విద్యార్థులు 

స్వతంత్ర భారతదేశానికి ఆయన రెండో ప్రధాన మంత్రి. నీతి, నిజాయితీ, పారదర్శకత, నైతికతకు నిలువెత్తు నిదర్శనం. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి.. ఆయన పేరు చెబితే, రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఏకంగా కేంద్ర రైల్వే శాఖా మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్పవ్యక్తి మన కండ్లముందు మెదులుతారు. అలాంటి మహానుభావుని పేరిట ఆయన తనయుడు అనిల్ శాస్త్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో లాల్‌బహదూర్ శాస్త్రి ఎడ్యుకేషనల్ సొసైటీ 1995 నుంచి విద్యా సేవలను అందిస్తోంది. ఎంతో ఉన్నతమైన ఆ మహానుభావుడి ఆశయాలను భావితరాలకు పరిచయం చేసేందుకు వీలుగా ఏర్పాటుచేయాలని తలచిన విద్యా సంస్థ పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. నిజంగా జాతికే అవమానకరంగా పరిణమిస్తోంది.

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): దేశానికి జై జవాన్.. జై కిసాన్ అంటూ కొత్త నినాదాన్నిచ్చి జాతిని ఉత్తేజపరచిన లాల్‌బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) ఆశయా లను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి సారధ్యంలో నడిపిస్తున్న విద్యా సంస్థకు ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన భూమిని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం భారతదేశాన్ని.. జాతిని నిలువెల్లా దహించి వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

భూ కేటాయింపు మార్గదర్శకాల ప్రకా రం.. మీరు దానిని వినియోగంలోకి తీసుకురాలేకపోయారు.. కనుక భూ కేటాయింపును రద్దు చేస్తున్నామంటూ జీవో జారీచేయడం క్షంతవ్యం కాదు. దేశానికి రెండో ప్రధానిగా పనిచేసి. నీతి, నిజా యితీ, నైతికతతో ముందుకుసాగిన లాల్‌బహదూర్ శాస్త్రి పేరుకైనా విలువ ఇవ్వా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆయన తనయుడు అనిల్ శాస్త్రి కోర్టుల చుట్టూరా తిరగాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే పెద్ద  మనసుతో ముందుకు వచ్చి.. ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా వ్యవహరించి ఉంటే గొప్పగా ఉండేదని, దేశ రెండో ప్రధానిని సరైన రీతిలో, సముచితంగా గౌరవించినట్టుగా ఉండేదని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

అలాంటి ఆలోచన ప్రభుత్వంలోని పెద్దలకు రాకపోవడం, అధికారులు ఆ సంస్థ ప్రాధాన్యత ను, సంస్థ పేరును, దాని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తి అనిల్ శాస్త్రి నేప థ్యాన్ని గుర్తించకపోవడం శోచనీయం. మేనేజ్‌మెంట్ విభాగంలో అత్యున్నతమైన విద్యను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాల్ బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎల్‌బీఎస్‌ఐ ఎం) అందిస్తోంది. అలాంటి అత్యున్నత మేనేజ్‌మెంట్ విద్యను హైదరాబాద్‌లోనూ అందించాలని సదరు ట్రస్ట్ తల చింది. అందుకు అవసరమైన భూమిని హైదరాబాద్ చుట్టుపక్కల కేటాయించాలని ట్రస్ట్ కోరింది.

2010కి ముందే అప్ప టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ట్రస్ట్ తరఫున ప్రభుత్వాన్ని సంప్రదించడంతో.. 2010లో జీవో నెం. 270 ద్వారా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లోని సర్వే నంబరు 283, 290లలో ఉన్న 12 ఎకరాలను లాల్ బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎల్‌బీఎస్‌ఐఎం)కు కేటాయించారు. అదే సంవత్సరం హెచ్‌ఎండీఏ అధికా రులు, సర్వే సిబ్బంది వెళ్ళి సదరు 12 ఎకరాల భూమిని సర్వేచేసి, సరిహద్దులు గుర్తించి, పంచనామా నిర్వహించి ట్రస్ట్ ప్రతినిధులకు అప్పగించారు.

ఆ తరువాత 2011లో అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్ ట్రస్ట్‌కు లేఖ రాస్తూ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు 12 ఎకరాల భూమిని సం స్థకు రిజిస్ట్రేషన్ చేస్తామనికూడా పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది.. కానీ అనుకున్న గడువులోగా భూ వినియోగాన్ని చేపట్టలేదనే కారణాన్ని సాకుగా చూపించి.. లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటుచేయాలని భావించిన విద్యాసంస్థను పురిట్లోనే పాతేశారు.

భూ కేటాయింపును రద్దుచేస్తూ.. 2023లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో.. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి హైకోర్టు ను ఆశ్రయించాల్సి వచ్చింది. మధ్యలో సదరు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ.. ఆ వివాదం ఒక కొలిక్కి రాలేదు. విద్యాసంస్థ కూడా ఏర్పాటుకాలేదు. ఇప్పటికీ కోర్టులో ఈ వివాదం నలుగు తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యున్నతమైన వ్యక్తి పేరిట వెలసిన విద్యా సంస్థ విషయంలో వ్యవహరించిన తీరును చూసి.. జాతి మొత్తం తలదించు కోవాల్సి వస్తోంది.

నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ‘చేతి’లోనే..

నీతి, నిజాయితీ, నైతికతనే పెట్టుబడిగా.. భావి తరాలకు మేనేజ్‌మెంట్ విభాగంలో అత్యుతన్న విద్యను అందించాలనే తలంపుతో.. దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్‌శాస్త్రి పేరిట ఏర్పాటైన సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపనీయమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి అంతటి మహానుభావుడి పేరుతో ఉన్న విద్యా సంస్థను ప్రభుత్వమే పూర్తిచేసి ఉంటే ఇప్పటికే.. వందలాది మంది విద్యార్థులు.. ముఖ్యంగా తెలంగాణకు చెందిన యువతకు మేనేజ్‌మెంట్ విద్య అంది ఉండేదని వారంటున్నారు. 

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. గడిచిన పుష్కరకాలంగా ప్రభుత్వాలు వందల, వేలాది ఎకరాలను ప్రైవేటు సంస్థలకు, కంపెనీలకు, కా ర్పొరేట్ వ్యాపారులకు ధారాదత్తం చేశాయనేది వాస్తవం. ఇందులో ఎన్ని సంస్థలు, కంపెనీలు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్ళా యనేది ఆ దేవుడికే తెలియాలి.

ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కనీసం లాల్‌బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎల్‌బీఎస్‌ఐఎం) ప్రతినిధులతో మాట్లాడి.. విద్యా సంస్థను ఏర్పా టు చేయకపోవడానికి కారణాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడాన్ని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. ప్రతి యేటా రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. తెలంగాణ యువతకు, విద్యార్థులకు అత్యుత్తమమైన మేనేజ్‌మెంట్ విద్యను అందించేందుకు కనీసం అండగా నిలబడకపోవడాన్ని రాజకీయ విమర్శకులుకూడా ప్రశ్నిస్తున్నారు. 

లాల్‌బహదూర్ శాస్త్రికి ఉన్న పేరును, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అయినా.. మాజీ ప్రధాని కుమారుడు అనిల్ శాస్త్రి ఆధ్వర్యంలో నడుస్తుందనే ఆలోచనతోనైనా సంస్థకు కేటాయించిన భూమిని రద్దు చేయకుండా.. అవ సరమైతే ఆర్థిక సాయం అందించాల్సిన చోట.. భూమిని మీకివ్వం వెళ్ళిపోండంటూ పొగపెట్టేలా రద్దు జీవోను జారీచేయడంపై మండిపడు తున్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నిర్ణయం ఉంది. దేశానికి జై జవాన్, జై కిసాన్ అంటూ.. అటు హరిత విప్లవాన్ని, ఇటు శ్వేత విప్లవాన్ని విస్తృతం చేయడంతోపాటు.. పాకిస్తాన్‌తో 1965లో జరిగిన యుద్ధానికి ముగింపు పలికిన మహానుభావుడి పేరుకైనా మనం విలువివ్వాలి. సంస్థ ప్రతినిధులను పిలిచి మాట్లాడి.. అవసరమైతే.. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల సీఎస్‌ఆర్ నిధులతోనైనా విద్యా సంస్థను ఏర్పాటు చేయడవచ్చు. జాతీయ, అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలకు ధీటుగా ఇక్కడ విద్యను అందించవచ్చు. అందుకు అవసరమైతే ప్రభుత్వమే పూనుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేటాయించిన భూమి అది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది.

కనీసం ఇప్పటికైనా ఈ భూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టి.. దేశానికి రెండో ప్రధానిగా పనిచేసి.. నీతి, నిజాయితీ, నిబద్ధత, నైతికతకు నిలువెత్తుగా నిలిచిన లాల్ బహదూర్ శాస్త్రి పేరిటి మేనేజ్‌మెంట్ విద్యా సంస్థను ప్రభుత్వం నిధులతో.. అ వసరం అయితే ప్రైవేటు సీఎస్‌ఆర్ నిధులతోనే ఏర్పాటు చేస్తే.. ఈ న్యాయ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడంతోపాటు.. కనీసం ఇప్పటికైనా ఆ మహానుభావునికి సరైన, సముచిత గౌరవం ఇచ్చినట్టవుతుంది..!

లాల్ బహదూర్‌శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎల్‌బీఎస్‌ఐఎం)కు రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 12 ఎకరాల భూ కేటాయింపు వివాదానికి సంబంధించిన కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..

*30.6.2010 రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ గ్రామంలోని సర్వే నెంబర్లు 283, 290 లలో ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని లాల్ బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు కేటాయిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీఎంఎంఎస్ నెం. 270ని జారీచేసింది. ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ట్రస్ట్ తరఫున మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకోసం ఈ 12 ఎకరాల భూమిని కేటాయించారు. వాస్తవానికి అంతకుముందే వట్టినాగుల పల్లి గ్రామ పరిధిలో ఎకరాకు రూ. 1.50 లక్షల చొప్పున కేటాయించిన భూమికి బదలుగా బుద్వేల్‌లో భూమిని కేటాయిస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు.

*23.7.2010.. బుద్వేల్ గ్రామం పరిధిలో ఎల్‌బీఎస్‌ఐఎంకు కేటాయించిన 12 ఎకరాల స్థలాన్ని పంచనామా నిర్వహించి సదరు సంస్థకు భౌతికంగా స్వాధీనం చేసి అప్పగించారు. హెచ్‌ఎండీఏ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే నెంబరు 283, 290 లలోని భూమిని సర్వేచేసి, సరిహద్దులు గుర్తించి సంస్థ ప్రతినిధులకు స్వాధీనం చేసినట్టుగా పంచనామాలో నమోదు చేశారు.

*19.10.2011 నాడు హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ) కమిషనర్ సంస్థకు లేఖ రాశారు. ఇందులో ప్రభుత్వం కేటాయింపు మేరకు ఇప్పటికే 12 ఎకరాల భూమిని సంస్థకు స్వాధీనం చేశామని, సంస్థ కోరినప్పుడు సదరు భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని అందులో పేర్కొన్నారు.

*16.3.2023 నాడు బుద్వేల్‌లో ఎల్‌బీఎస్‌ఐఎంకు 12 ఎకరాల భూ కేటాయింపును రద్దుచేస్తూ అప్పటి ప్రభుత్వం జీవోఎంఎస్ నెం. 38ను జారీ చేసింది. భూమి కేటాయింపు ఉద్దేశం మేరకు  వినియోగంలోకి తీసుకురాలేదన్న కారణంతో ప్రభుత్వం సదరు భూకేటా యింపును రద్దు చేసింది.

*6.4.2023.. జీవో నెంబరు 38ను సవాలు చేస్తూ లాల్ బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్  తరఫున సి.హనుమంతరావు పార్టీ ఇన్ పర్సన్‌గా రిట్ పిటిషన్ (నెం.9418/2023) ను హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. సదరు భూమిపై తమకు హక్కులు ఉన్నాయని, 2010లోనే సర్వేచేసి, హద్దులు నిర్ణయించి భౌతికంగా తమకు స్వాధీనం చేశారని పిటిషనర్ వాదించారు. తమకు నోటీసు ఇవ్వకుండా, విచారణకు అవకాశం కల్పించకుండా కేటాయింపును రద్దుచేశారని పేర్కొంటూ.. జీవో నెం. 38 అమలును నిలిపివేయాలని, భూమిపై జోక్యం చేసుకోవద్దని, ఇతరులకు కేటాయించవద్దని కోరారు. ఈ మేరకు దాఖలైన మూడు మధ్యంతర దరకాస్తులను హైకోర్టు అనుమతించింది. 2010 భూ కేటాయింపు జీవోను, 23.7.2010 నాటి పంచనామా, 2011లో హెచ్‌ఎండీఏ రాసిన లేఖను కోర్టు పరిశీలించింది.

*25.4.2023 రిట్ పిటిషన్‌ను హైకోర్టు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పార్టీ ఇన్‌పర్సన్‌గా హనుమంతరావు వాదిస్తూ.. ప్రభుత్వ జీవో 38ను ఉపసహరించుకున్నందున రిట్ పిటిషన్‌పై విచారణ ముగించాలని కోరినట్టు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో నమోదు చేశారు. దీనితో కేసు పూర్వాపరాల్లోకి వెళ్ళకుండా రిట్ పిటిషన్‌ను డిస్పోజ్ చేశారు. అంటే భూమి కేటాయింపు రద్దు చేయడం చట్టబద్ధమా, కాదా అన్న ప్రధాన నివాదంపై తుది నిర్ణయం వెలువరించలేదు.

*1.5.2024.. రాష్ట్ర హైకోర్టు 25.4.2023 నాటి సింగిల్ జడ్జి ఇచ్చిన డిస్పోజల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. పిటిషనర్ సంస్థ దాఖలు చేసిన రిట్ అప్పీల్ నెం. 328/2024 పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. జీవో 38ను ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున రిట్ పిటిషన్‌పై విచారణను ముగించాలని తాను కోరలేదని సంస్థ తరఫున పార్టీ ఇన్ పర్సన్ సీ హనుమంతరావు వాదించారు. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పులన ప్రస్తావించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగ్ జడ్జి ఉత్తర్వుల్లో నమోదైన అంశానికి విరుద్ధంగా రిట్ అప్పీల్‌లో వాదించలేరని పేర్కొంది. అయితే 25.4.2023 నాటి ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే.. సింగల్ జడ్జి వద్ద రివ్యూ/రికాల్ కోరవచ్చని సూచిస్తూ.. రిట్ అప్పీల్‌ను డిస్పోజ్ చేస్తూ తీర్పు చెప్పింది.

*3.5.2024 సంస్థ ప్రధాన రిట్ పిటిషన్‌లో రివ్యూ ఐఏ నెం. 1/2024 దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. తాను రిట్ పిటిషన్‌పై విచారణ ముగించాలని కోరలేదన్న పిటిషనర్ వాదనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. రివ్యూ పిటిషన్‌ను అనుమతిస్తూ.. 25.4.2023న డిస్పోజ్ చేసిన ప్రధాన రిట్ పిటిషన్ నెం. 9418/2023ను పునరుద్ధరిస్తూ కీలక ఆదేశాలను జారీ చేశారు. దీనితో అప్పటి వరకు ముగిసిన రిట్ పిటీషన్ మళ్ళీ విచారణలోకి వచ్చింది. అదే రోజు హైకోర్టు.. తదుపరి విచారణ వరకు యధాతథస్థితిని కొనసాగించాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ.. స్టేటస్‌కో ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను 28.6.2024కు వాయిదా వేసింది.

*8.9.2026 రిట్ పిaటిషన్ నెం. 9418/2023 మళ్ళీ హైకోర్టు ముందు లిస్ట్ అయ్యింది. పిటిషనర్ దాఖలు చేసిన ఇంప్లీడ్ అప్లికేషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతివాదులు గడువు కోరారు. జస్టిస్ పుల్లా కార్తీక్ గడువు మంజూరుచేసి విచారణను 15.9.2026కు వాయిదా వేశారు.

*15.9.2026 విచారణ అనంతరం అందుబాటులో ఉన్న  వివరాల ప్రకారం.. 15.9.2026 తరువాత కేసు తదుపరి విచారణ తేదీతో కాజ్ లిస్ట్ కాలేదు. ఇప్పటి వరకు జీవో 38 ద్వారా 12 ఎకరాల భూమి కేటాయింపును రద్దు చేయడం చట్టబద్ధమా, కాదా అన్న అంశంపై హైకోర్టు మెరిట్స్‌లో తుది తీర్పు వెలువడాల్సి ఉంది.

*ప్రస్తుత కేసు స్థితి : 2010లో భూమి కేటాయింపు, 23.7.2010నాడు సంస్థకు భూమిని భౌతికంగా స్వాధీనం చేయడం, 2011లో హెచ్‌ఎండీఏ దానిని దృవీకరించడం, 2023లో ఆ భూమి కేటాయింపును రద్దుచేస్తూ జీవో 38ని విడుదల చేశారు. ఆ రద్దును సవాలు చేస్తూ వేసిన రిట్ పిటిషన్ 25.4.2023న మెరిట్స్‌లోకి వెళ్ళకుండానే డిస్పోజ్ అయ్యింది. రివ్యూ ప్రక్రియ అనంతరం 3.5.2024న తిరిగి పిటిషన్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ ప్రధాన రిట్ పిటిషన్ జస్టిస్ పుల్లా కార్తీక్ సింగిల్ జడ్జి ఎదుట విచారణలో ఉంది. భూమి వివాదంపై తుది ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు