వచ్చే ఏడాదే బుల్లెట్ రైలు!

24-11-2026 | 05:05am

మే లేదా జూన్ నెలలో ట్రయల్ రన్ 

అహ్మదాబాద్-ముంబై మధ్య తొలి రైలు

  508 కి.మీలు.. 12 స్టేషన్లు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, నవంబర్ 23: భారత్‌లో తొలి బుల్లెట్ రైలు(Bullet train) ప్రారంభానికి ముహూర్తం ఖరా రైంది. అహ్మదాబాద్-ముంబై(Ahmedabad-Mumbai) మధ్య వచ్చే ఏడాది బుల్లెట్ ట్రెయిన్‌ను నడిపిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) తెలిపారు. మే లేదా జూన్ నెలలోనే ట్రయల్ రన్(Trial run) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న 508 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్‌లో కీలక పనులు పూర్తవుతున్నాయన్నారు.

12 స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్రయల్ రన్ సమయంలో రైలును గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిపించి వివిధ సాంకేతిక అంశాలను పరీక్షిస్తామన్నారు. గుజరాత్‌లోని సూరత్-బిలిమోరా మధ్య ఇప్పటికే 50 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణం పూర్తయింది. ఈ సెక్షన్‌లో విద్యుదీకరణ పనులు కూడా కీలక దశకు చేరుకున్నాయి. 

8 కోచ్‌లు.. ఒకేసారి 557 మంది ప్రయాణం

సూరత్-బిలిమోరా మధ్య నిర్మించిన హైస్పీడ్ రైలు మార్గంలో ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ ద్వారా విద్యుత్ సరఫరాను(Electricity supply) ప్రారంభించామని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుల్లెట్ రైలు కోచ్‌లను బెంగళూరులోని బీఈఎంఎల్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీల్లో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ కోచ్‌లు సూరత్ డిపోకు చేరుకుంటాయి. 202 మీటర్ల పొడవు ఉండే ఈ రైలులో 8 కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి 557 మంది ప్రయాణించొచ్చు.

ఆగస్టు 15వ తేదీ నాటికి సూరత్-బిలిమోరా మధ్య మరో బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2029 నాటికి ఈ సేవలను థానే వరకు విస్తరించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. బుల్లెట్ రైలు ప్రారంభమైతే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నారు. రైళ్లలో సరుకు రవాణా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల రైల్వే శాఖకు ఈ ఏడాది రూ.1,078 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందన్నారు. రైళ్లలో ఈ ఏడాది ఇప్పటి వరకు 800 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయన్నారు. 

మరిన్ని వార్తలు