తొమ్మిది పెళ్లిళ్ల వివాదం.. భర్తకు హైకోర్టులో భారీ ఊరట

11-11-2026 | 09:51am

బెంగళూరు: తొమ్మిది వివాహాలు చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ దాఖలు చేసిన గృహహింస, వరకట్న వేధింపుల కేసును కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కొట్టివేసింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, విచారణ కొనసాగించడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి దారితీస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిస్ ఎం. నాగప్రసన్న ఈ మేరకు కీలక తీర్పు (Court Verdict) వెలువరించారు.

హొసపేటకు చెందిన రాజకీయ నాయకుడు రాజా హుస్సేన్‌కు, తబస్సుమ్ అనే మహిళకు 2022 జనవరిలో వివాహమైంది. అయితే పెళ్లైన ఏడు నెలలకే, అదే ఏడాది ఆగస్టులో భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323, 504, 506 కింద కేసు (Domestic Violence Case) నమోదు చేశారు. ఈ కేసు ఉడుపి కోర్టులో విచారణ దశలో ఉండగా, తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ రాజా హుస్సేన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

తబస్సుమ్‌కు గతంలోనే ఎనిమిది వివాహాలు జరిగాయని, తాను ఆమెకు ఏడో భర్తనని రాజా హుస్సేన్ కోర్టుకు తెలిపారు. వివాహం చేసుకోవడం, కొంతకాలానికి గొడవలు పెట్టుకోవడం, అనంతరం కేసులు నమోదు చేసి డబ్బుల కోసం ఒత్తిడి చేయడం ఆమెకు అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా న్యాయస్థానానికి సమర్పించారు. అయితే ఈ వాదనలను తబస్సుమ్ తరఫు న్యాయవాది ఖండించారు. ఇప్పటివరకు తాను నాలుగు వివాహాలు మాత్రమే చేసుకున్నానని, ప్రతి వివాహం నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే మరో పెళ్లి చేసుకున్నానని కోర్టుకు వివరించారు.

ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన పత్రాలను పరిశీలించిన జస్టిస్ ఎం. నాగప్రసన్న.. తబస్సుమ్ చేసిన ఆరోపణలు సాధారణంగా, అస్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి మద్దతుగా నిర్దిష్టమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కేవలం చార్జిషీట్ దాఖలైనంత మాత్రాన బలహీనమైన ఆరోపణలకు చట్టబద్ధమైన బలం చేకూరదని వ్యాఖ్యానించారు.ఒక వ్యక్తి ఎన్ని వివాహాలు చేసుకున్నారనే అంశం ఆధారంగా వారి నైతికతను లేదా నేర ప్రవృత్తిని అంచనా వేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అసాధారణమైన వివాహ చరిత్ర ఉందనే కారణంతో వారి ఫిర్యాదులను పూర్తిగా కొట్టిపారేయడం కూడా సరికాదని పేర్కొంది.

అయితే క్రిమినల్ చట్టాలను వ్యక్తిగత డిమాండ్లు నెరవేర్చుకోవడానికి, ఇతరులపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించకూడదని హితవు పలికింది. ప్రస్తుత కేసులో అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం విచారణ కొనసాగించడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి దారితీస్తుందని అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలో రాజా హుస్సేన్‌పై నమోదైన కేసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు