ప్రియాంక కౌంటర్
నెహ్రూను టార్గెట్ చేస్తున్నారెందుకు?
న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఘనంగా నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో నెహ్రూ పోషించిన పాత్రను గుర్తుచేస్తూ ఆయనపై ఇప్పటికీ విమర్శలు, దాడులు కొనసాగుతుండటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ మరణించి ఆరు దశాబ్దాలకు పైగా గడిచినా, రాజ్యాంగం (Constitution), ప్రజాస్వామ్యాన్ని (Democracy) బలహీనపరచాలని ప్రయత్నిస్తున్న వారు ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రియాంక పేర్కొన్నారు. ఇది నెహ్రూకు దేశం పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నెహ్రూ ఒక అరుదైన వ్యక్తిత్వమని, ఆయనలో విప్లవకారుడు (Revolutionary), దూరదృష్టి కలిగిన నాయకుడు (Visionary), దేశ నిర్మాణకర్త (Nation Builder) వంటి లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ సందేశాన్ని పంచుకున్న ప్రియాంక.. భారతదేశానికి నెహ్రూ అందించిన సేవలను గుర్తుచేశారు.