ఆసుపత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ) అధినేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ (Sharad Pawar) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీలో అసౌకర్యం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత మూడు రోజులుగా ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో (Breach Candy Hospital) చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అనంతరం శనివారం ఆయనను డిశ్చార్జ్ చేశారు.
శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటికి వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిపారు. అయితే పూర్తిస్థాయిలో కోలుకునే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొంతకాలం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని, శారీరక శ్రమకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.
శరద్ పవార్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయన ఆరోగ్యంపై వివరాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇతర రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ పరామర్శించారు.
శరద్ పవార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఊరట వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ వైద్యుల సూచనల మేరకు మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాతే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది