చైనా స్పైతో ప్రేమాయణం

07-11-2026 | 01:17pm

ప్రేమ పేరుతో స్పై ఆపరేషన్? అమెరికా మెమోలో సంచలనం!

అమెరికా: ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక సంస్థగా ఎదిగిన ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ గూఢచర్య ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చైనా గూఢచారి సంస్థతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న ఓ మహిళతో ఆయనకు ప్రేమ సంబంధం ఉందంటూ అమెరికా Intelligence వర్గాలు రూపొందించిన రహస్య మెమోలో ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామం అమెరికా టెక్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. సింగపూర్ కేంద్రంగా పనిచేసే మెగాస్పీడ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న అలిస్ హువాంగ్ (హువాంగ్ లే)తో జెన్సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు మెమోలో పేర్కొన్నారు. మెగాస్పీడ్ సంస్థ ఎన్విడియాకు కస్టమర్‌గా ఉంది. అయితే అలిస్ హువాంగ్ చైనాకు చెందిన ప్రధాన గూఢచారి సంస్థ Ministry of State Security (MSS) కోసం పనిచేస్తున్నారని అమెరికా అధికారులు అనుమానిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

అమెరికా తయారీకి చెందిన అత్యాధునిక AI Chipsపై సమాచారం సేకరించడం, ఎగుమతి ఆంక్షలను దాటి వాటిని చైనాకు చేరవేసేందుకు ప్రయత్నించడం ఈ వ్యవహారం వెనుక ఉద్దేశమై ఉండవచ్చని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జెన్సన్ హువాంగ్‌తో ఆమె సన్నిహితంగా మెలిగినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కొందరు ఉన్నతాధికారుల మధ్య రహస్యంగా ఈ మెమోను పంచుకున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య శిఖరాగ్ర సమావేశానికి కొద్ది రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.

ఆరోపణలను ఖండించిన ఎన్విడియా, చైనా

ఈ ఆరోపణలను ఎన్విడియా తీవ్రంగా ఖండించింది. తమ సీఈఓ ప్రతి ఏడాది వేలాది మంది Customer Executivesను కలుస్తుంటారని, అందులో భాగంగానే మెగాస్పీడ్ ప్రతినిధులతో సమావేశమయ్యారని సంస్థ తెలిపింది. జెన్సన్ హువాంగ్‌పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. చిప్‌ల అక్రమ తరలింపునకు సంబంధించి గతంలో నిర్వహించిన Internal Investigationలోనూ ఆరోపణలకు ఆధారాలు లభించలేదని పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ కూడా ఈ వార్తలను తోసిపుచ్చింది. బీజింగ్‌పై బురదజల్లేందుకు నిరాధారమైన ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది.

వివరణ కోరిన అమెరికా కాంగ్రెస్ కమిటీలు

మరోవైపు ఈ వివాదం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా హౌస్‌కు చెందిన ముగ్గురు రిపబ్లికన్ కమిటీ ఛైర్మన్లు జెన్సన్ హువాంగ్‌కు చైనా గూఢచారి ఆరోపణలు, విదేశీ గూఢచర్య ముప్పుల నుంచి కంపెనీ అనుసరిస్తున్న Security Protocolsపై వివరణ కోరారు. అయితే అలిస్ హువాంగ్ కార్యకలాపాల గురించి జెన్సన్ హువాంగ్‌కు ముందే తెలుసనేందుకు బహిరంగంగా ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ AI మార్కెట్‌లో అమెరికా, చైనా మధ్య పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో ఈ వివాదం తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యాధునిక సెమీకండక్టర్ టెక్నాలజీ, చిప్ ఎగుమతులు, జాతీయ భద్రత వంటి అంశాలతో ముడిపడిన ఈ వ్యవహారం ఎన్విడియాకు కొత్త సవాలుగా మారింది. అయితే మహిళపై వచ్చిన గూఢచర్య ఆరోపణలు, జెన్సన్ హువాంగ్‌తో సంబంధాలపై వచ్చిన కథనాలు ఇంకా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.

మరిన్ని వార్తలు