కేపీహెచ్‌బీ ఫ్లాట్లపై సుప్రీం కీలక తీర్పు

07-11-2026 | 11:28am

సొంతింటి కల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ఫేజ్-15 కొనుగోలుదారులకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. దాదాపు 17 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదంలో ఉన్న 101 ఫ్లాట్లను ఈ నెల 23వ తేదీలోగా కొనుగోలుదారుల పేరిట రిజిస్ట్రేషన్ (Flat Registration) చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును ఆదేశించింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఇక జాప్యం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాయిదాల చెల్లింపుల్లో ఆలస్యమైన కొనుగోలుదారుల నుంచి 14 శాతం వడ్డీ (14 Percent Interest) వసూలు చేయాలా? వద్దా? అనే అంశాన్ని హైకోర్టు తేల్చే వరకు వేచి చూడాలని సూచించింది. అయితే వడ్డీ వివాదాన్ని సాకుగా చూపి రిజిస్ట్రేషన్లను నిలిపివేయకూడదని స్పష్టం చేసింది. ఈ నెల 23లోగా 101 ఫ్లాట్లను కొనుగోలుదారుల పేర్లపై నమోదు చేయాలని ఆదేశించింది.

అంతేకాకుండా హైకోర్టులో వడ్డీ వివాదం పరిష్కారమయ్యే వరకు ఈ ఫ్లాట్లను ఇతరులకు విక్రయించడం, బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టకూడదని హౌసింగ్ బోర్డుతో పాటు కొనుగోలుదారులకు కూడా ఆంక్షలు విధించింది.

2009లో హౌసింగ్ బోర్డు 'సంపూర్ణం' పథకం (Sampoorna Scheme) కింద కేపీహెచ్‌బీ ఫేజ్-15లో ఫ్లాట్లను కేటాయించింది. తొలుత ఒక్కో ఫ్లాట్ ధరను రూ.30.80 లక్షలుగా నిర్ణయించగా.. ఆ తర్వాత రూ.47.85 లక్షలకు పెంచడంతో వివాదం మొదలైంది. నిర్మాణంలో జాప్యం, అదనపు ధరల వసూలుపై కొనుగోలుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారుల ఫోరం నుంచి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) వరకు న్యాయపోరాటం సాగించారు.

ఈ వివాదంలో హౌసింగ్ బోర్డు వైపు నుంచే నిర్మాణ జాప్యం జరిగిందని గుర్తించిన ఎన్‌సీడీఆర్‌సీ.. కొనుగోలుదారుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయడం సమర్థనీయం కాదని గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హౌసింగ్ బోర్డు తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా తమ వైపు నుంచి జరిగిన ఆలస్యానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తామని, కొనుగోలుదారుల నుంచి మాత్రం 14 శాతం వడ్డీ వసూలుకు అనుమతించాలని బోర్డు కోరింది. అయితే వడ్డీ అంశంపై తుది నిర్ణయం వచ్చే వరకు రిజిస్ట్రేషన్లు ఆపకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

17 ఏళ్లుగా ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న 101 మంది కొనుగోలుదారులకు ఈ ఆదేశాలు పెద్ద ఊరటనిచ్చాయి. ధరల పెంపు, నిర్మాణ జాప్యం, వడ్డీ వివాదాలతో ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరిగిన వారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగనుంది. కేపీహెచ్‌బీ ఫేజ్-15 ఫ్లాట్ల వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలు కీలక మలుపుగా మారాయి.

మరిన్ని వార్తలు