మైలేజీకి మంగళం.. E20 కాదు.. 420 దందా!

07-11-2026 | 12:57pm

పెట్రోల్‌లో 420 దందా.. రాహుల్ సంచలన ఆరోపణలు!

న్యూఢిల్లీ: పెట్రోల్ కొట్టించుకుంటున్న వాహనదారులకు షాకింగ్ న్యూస్! దేశంలో పెట్రోల్‌లో కలుపుతున్న ఇథనాల్ మోతాదుపై కొత్త వివాదం మొదలైంది. ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితిని మించి ఆయిల్ కంపెనీలు ఇథనాల్ కలుపుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన Laboratory Tests ఫలితాలను ప్రస్తావిస్తూ చమురు సంస్థలపై తీవ్ర విమర్శలు చేశారు. “E20 కాస్తా 420గా మారింది.. ప్రజల కార్ల నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్నారు” అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వ్యాఖ్యానించారు.

కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ వెల్లడించిన వివరాలు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 14 Petrol Samplesను ప్రభుత్వ గుర్తింపు పొందిన Independent Laboratoryలో పరీక్షించారు. వీటిలో 11 శాంపిల్స్‌లో Ethanol Content 20 శాతానికి మించి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని మంత్రి తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) శాంపిల్‌లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) శాంపిల్‌లో 30.5 శాతం ఇథనాల్ నమోదైనట్లు వివరించారు.

ఇక భారత్ పెట్రోలియం (BPCL), నయారా ఎనర్జీ, షెల్ సంస్థలకు చెందిన శాంపిల్స్‌లోనూ 25.5 నుంచి 26.5 శాతం మధ్య Ethanol ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు జిల్లాల నుంచి ఈ Samples సేకరించారు. అధిక మోతాదులో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల Mileage తగ్గే అవకాశం ఉందని, Engine Performanceపై కూడా ప్రభావం పడవచ్చని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మొదట ఆయిల్ కంపెనీల ల్యాబ్‌లకు పంపిన శాంపిల్స్‌పై స్పష్టమైన వివరాలు రాకపోవడంతో స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్షలు చేయించినట్లు తెలిపారు.

ఆరోపణలను ఖండించిన ఆయిల్ కంపెనీలు

మరోవైపు రాహుల్ గాంధీ, కర్ణాటక ప్రభుత్వం చేసిన ఆరోపణలను IOCL, BPCL, HPCL సహా చమురు మార్కెటింగ్ సంస్థలు తోసిపుచ్చాయి. శాంపిల్స్ సేకరణ, పరీక్షా విధానాలు నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 893 శాంపిల్స్‌తో Joint Quality Monitoring నిర్వహించామని, వాటిలో కర్ణాటకకు చెందిన 56 శాంపిల్స్ కూడా ఉన్నాయని తెలిపాయి. తమ పరీక్షల్లో Ethanol Percentage 19 నుంచి 21 శాతం మధ్యే నమోదైందని, కర్ణాటక శాంపిల్స్ సగటు 19.3 శాతంగా ఉందని కంపెనీలు స్పష్టం చేశాయి. దీంతో ఇథనాల్ బ్లెండింగ్‌పై ప్రభుత్వ వాదనలు, కర్ణాటక ల్యాబ్ నివేదికలు, ఆయిల్ కంపెనీల వివరణల మధ్య వివాదం నెలకొంది. అసలు పెట్రోల్‌లో ఇథనాల్ శాతం ఎంత? వాహనదారుల Mileage, Engineపై దీని ప్రభావం ఏమిటి? అన్న అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే ఈ ఆరోపణలు, పరీక్షా ఫలితాలపై తుది నిర్ధారణ రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు