దండారి ఆటల్లో యువత సామాజిక సందేశం
ఉట్నూర్, నవంబర్ 07 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న దండారి ఉత్సవాలు (Dandari Festival) సామాజిక చైతన్యానికి వేదికగా నిలుస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో గిరిజన యువత నృత్య ప్రదర్శనల (Dance Performances) ద్వారా యువతకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
గంజాయి, మద్యం వంటి చెడు వ్యసనాలకు (Drug Addiction) దూరంగా ఉండాలని పాటలు, ఆటల రూపంలో వివరిస్తున్నారు. సెల్ఫోన్ల ద్వారా ఆకర్షితులై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రేమ వివాహాల విషయంలో కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు పాటించాలని సందేశం ఇస్తున్నారు.
చదువు వల్ల కలిగే ప్రయోజనాలు, చట్టాలపై అవగాహన (Social Awareness) కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నారు. విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, పిల్లల భవిష్యత్తుకు చదువు ఎంతో కీలకమని యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారు. సంప్రదాయ కళారూపాల ద్వారా సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం పలువురిని ఆకట్టుకుంటోంది.