రామప్పకు ముప్పు.. సింగరేణి గనిపై ఎన్జీటీ ఆరా
వెంకటాపూర్,( విజయక్రాంతి ): ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, రామప్ప చెరువు సమీపంలో ప్రతిపాదించిన బొగ్గు గని తవ్వకాల వ్యవహారంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal) సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలపై స్పందించింది. ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణుల సభ్యుడు డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును నమోదు చేసింది. ములుగు జిల్లా పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర ఆలయం (Ramappa Temple), రామప్ప చెరువు సమీపంలో సింగరేణి బొగ్గు తవ్వకాలకు సిద్ధమవుతున్నట్లు గుర్తించింది.
రామప్ప చెరువుకు సుమారు 300 మీటర్ల దూరంలోనే తవ్వకాలు చేపట్టే ప్రతిపాదన ఉందని ట్రిబ్యునల్ గుర్తించింది. గనుల తవ్వకాల వల్ల చెరువులో నీటిమట్టం మార్పులు సంభవించి, భూగర్భ జలాల ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంది. సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప ఆలయ ఇసుక పునాది నిర్మాణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలను కూడా పరిశీలించింది.
ఈ వ్యవహారంలో పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 నిబంధనల ఉల్లంఘన జరిగే అవకాశాలను ట్రిబ్యునల్ ప్రస్తావించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ములుగు జిల్లా కలెక్టర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం, కేంద్ర భూగర్భ జలాల సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది. సంబంధిత అధికారులు అఫిడవిట్ల రూపంలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు దక్షిణాది జోనల్ బెంచ్ పరిధిలోకి రావడంతో తదుపరి విచారణ నిమిత్తం కేసు రికార్డులను చెన్నైలోని ఎన్జీటీ దక్షిణాది జోనల్ బెంచ్‌కు బదిలీ చేసింది. ఎన్జీటీ తాజా చర్యతో రామప్ప దేవాలయం, చెరువు పరిరక్షణపై స్థానికులు, పర్యావరణ ప్రేమికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.