4 August, 2026 | 4:51 AM

దళితులపై పాలకులు వివక్ష వీడాలి

04-08-2026 02:10 AM
  1. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తాం 
  2. డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్

భద్రాద్రికొత్తగూడెం, ఆగస్టు 3 (విజయక్రాంతి): దళితుల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత విధానాలను విరమించి, రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం డీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా  నిర్వహించారు. ఈ సందర్భంగా పేరాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు తరతరాలుగా నివసిస్తున్న దళితులకు కూడా సమాన హక్కులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలు కల్పించాలని కోరారు.

సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు పట్టాలు మంజూరు చేసి భూ హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ప్లాన్ పథకాన్ని పునరుద్ధరించి నిధులను పూర్తిగా విడుదల చేయడంతో పాటు, దళిత యువ పారిశ్రామికవేత్తలకు మంజూరైన ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కోరారు.

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేసి, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళిత నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్మూలించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు గనిగళ్ళ వీరాస్వామి విశంశెట్టి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.