పాలమూరు, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు అత్యున్నత ప్రాధాన్యం
- సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం
- సుప్రీం కోర్టు తీర్పుతో న్యాయపరమైన స్పష్టత
- తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు అంతర్రాష్ట్ర విభాగాన్ని బలోపేతం చేయాలి
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి) : రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యున్నత ప్రాధాన్య జాబితాలో ఉంచి, సాధ్యమైనంతవరకు ఆరు నెలల్లో ప్రాజెక్టులవారీగా పర్యావరణ అనుమతులు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీ ర్పు న్యాయపరమైన స్పష్టతను కల్పించడంతోపాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల అనుమ తుల సాధనకు కొత్త అవకాశాల ద్వారాలను తెరిచిందని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, న్యాయప రమైన అంశాలు, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొ న్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొ న్న అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలో చట్టబద్ధంగా పర్యావరణ అనుమతులు పొందిన ప్రాజెక్టులకు ఆ రక్షణ కొనసాగుతుందని తెలిపారు.
ఇప్పటికే పరిశీలనలో ఉన్న దరఖాస్తులను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రతిపాదనలను ప్రాజెక్టులవారీగా సమగ్రంగా పరిశీ లించి, సాంకేతిక, విధానపరమైన లోపాల ను సరిదిద్దిన అనంతరం చట్టపరంగా అవకాశం ఉన్నచోట తిరిగి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
నిర్వాసితుల హక్కులకు రక్షణ
ప్రాజెక్టు డిజైన్లలో గణనీయమైన మార్పులు చేపట్టే ముందే పర్యావరణ, అటవీ, పునరావాసం, భూసేకరణ, పరిహారం తదితర అంశాలను పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలను ముందుగానే పాటించడం ద్వారా న్యాయపరమైన వివాదాలను నివారించవచ్చని, అదే సమయంలో రైతులు, భూ యజమానులు, ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల న్యాయబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి పరిధిలో భూము లు, జీవనోపాధి కోల్పోతున్న కుటుంబాలకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కాలువ తవ్వకాలు, గట్ల తొలగింపు లేదా కోత అవసరాలు, నీటి విడుదల కేంద్రాలు, గ్రామాల మధ్య అనుసంధానం, రహదారి క్రాసింగ్లు, ప్రజల రాకపోకలకు అవసరమైన వంతెనలు తదితర అంశాలన్నింటినీ ఈ తనిఖీల పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అధ్యయనాలు, పర్యావరణ పత్రాలను ఏమాత్రం ఆలస్యం లేకుండా నవీకరించాలని ఆదేశించారు. అనుమతులు వచ్చిన తర్వాత మళ్లీ సన్నాహాల పేరుతో సమయం వృథా కాకూడదని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల విషయంలోనూ ఇదే స్థాయి అత్యవసరతతో వ్యవహరించాలని సూచించారు.
ఎన్జీటీ, సుప్రీం కేసులకు వ్యూహం
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసుల విషయంలో రాష్ట్ర న్యాయ సలహాదారులు, అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో శాఖాధికారులు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి పర్యావరణ కేసును విడివిడిగా సమీక్షించి, నిబంధనల అమలు నివేదికలు, సాంకేతిక రికార్డులు, పర్యావరణ అధ్యయనాలు, కౌంటర్ అఫిడవిట్లను ముందుగానే సిద్ధం చేయాలన్నారు.
పర్యావరణ అనుమతుల సాధన కోసం రాష్ట్ర బృందానికి నాయకత్వం వహిస్తున్న న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఈ సందర్భంగా వివిధ కేసుల ప్రస్తుత స్థితి, సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల ఏర్పడనున్న న్యాయపరమైన పరిణామాలను సమావేశానికి వివరించారు. భూములు, గ్రామాలు, నివాస ప్రాంతాలు, ప్రజా మౌలిక వసతులు, ఇతర ఆస్తులు ఎంతవరకు ముంపునకు లేదా బ్యాక్వాటర్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందో నిర్ధారించేందుకు శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేలోపే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బ్యాక్‌వాటర్ ప్రభావం ఎం తవరకు ఉంటుందో తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా అంచనా వేసి, సంబంధిత సంస్థల ముందు ఉంచాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పోలవరం ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావంతో నష్టపోయే భూములు, మౌలిక వసతులు, ఇతర ఆస్తులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత కేంద్ర సంస్థలదేనని చెప్పారు.
అంతర్రాష్ట్ర విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి
తెలంగాణ సాగునీటి ప్రయోజనాల పరిరక్షణలో అంతర్రాష్ట్ర విభాగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆ విభాగాన్ని తగిన సాంకేతిక, పర్యావరణ, న్యాయ నిపుణులతో మరింత బలోపేతం చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ఎన్జీటీ, సుప్రీంకోర్టు, ఇతర న్యాయస్థానాలు, చట్టబద్ధ సంస్థల ముందు తెలంగాణ వాదనను శాస్త్రీయ ఆధారాలు, సమగ్ర పత్రాలతో బలంగా వినిపించే సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు.
ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి చరిత్ర అధికారుల వద్ద అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అసలు పర్యావరణ అనుమతులు, ఆ తర్వాత ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న మార్పులు, రీడిజైన్, విస్తరణ, ప్రాజెక్టు ప్రాంత మార్పు, పెండింగ్ దరఖాస్తులు, న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులు, పాటించాల్సిన నిబంధ నలు, జరిమానాలు ఉంటే వాటి వివరాలు వంటి ప్రతి అంశాన్ని ఒకే సమగ్ర దస్త్రంలో పొందుపరచాలని ఆదేశించారు.
పర్యావరణ అనుమతుల సాధనకు మంత్రి దశలవారీ కార్యాచరణను నిర్దేశించారు. నవీకరించిన పర్యావరణ అధ్యయనాలు, నిబంధనల అమలు నివేదికలు, భూ రికార్డులు, న్యాయపరమైన పత్రాలు, ఇతర అవసరమైన ఫైళ్లను 30 రోజుల్లో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రధాన పరిపాలనా ప్రక్రియతోపాటు దరఖాస్తుల తయారీ, పరిశీలన, సమర్పణకు సంబంధించిన దశలను 60 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు.
నిర్ణీత గడువుల అమలులో అలసత్వం, నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేదని స్పష్టం చేశారు. పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, పునరావాస ప్రణాళికలు, అటవీ అనుమతుల ఫైళ్లు, భూసేకరణ రికార్డులు, న్యాయస్థానాల్లో దాఖలు చేయాల్సిన కౌంటర్ అఫిడవిట్ల తయారీలో ఏ చిన్న లోపం ఉన్నా మొత్తం అనుమతుల ప్రక్రి య ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ప్రతి పత్రం సాంకేతికంగా, న్యాయపరంగా లోపరహితంగా ఉండేలా చూడాలని సూచించారు.






