వెబ్‌సైట్ ఆధారంగా అల్లుకున్న కల్పిత కథ
బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఐ బొమ్మ’. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ (Sri Mallanna Creations) బ్యానర్‌పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్నదే ఐ బొమ్మ’ కథగా చూపించారు. చిన్న చిత్రాల నిర్మాతలకు క్యూబ్, యూఎఫ్‌వో ఛార్జీలు భారంగా మారుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కొత్తగా ఎన్నికైన మా నిర్మాతల మండలి కార్యవర్గం తరపున హామీ ఇస్తున్నా” అన్నారు. చిత్ర దర్శకుడు విజయ్ రఘునాథభట్ల మాట్లాడుతూ.. “గత ఏడాది అంతా ఐ బొమ్మ గురించే న్యూస్ వైరల్ అయ్యింది.
మనలో చాలా మంది ఐ బొమ్మ పైరసీ సినిమాలు చూసే ఉంటారు. అసలు ఆ సైట్ ప్రారంభించడం వెనక ఏం జరిగిందనేది అందరికీ ఆసక్తికరమే. జీవితంలో కొన్ని సంఘర్షణలకు లోనైన ఓ వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా ఎలా అడుగువేశాడు. అతన్ని ఈ వ్యవస్థ ఎలా పట్టుకుంది. అతని ఆలోచన వెనక ఏం జరిగింది అనే అంశాలతో ఈ సినిమా రూపొందించాం. ఆ సంచలన సంఘటనను ఆధారంగా చేసుకొని రాసుకున్న కల్పిత కథ ఇది” అని తెలిపారు.
చిత్ర నిర్మాత కురువ జమన్న మాట్లాడుతూ.. “మా వృత్తి వ్యవసాయం. సినిమాల మీద ఇష్టంతో నిర్మాణంలోకి వచ్చా. ఈ కథను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారనే నమ్మకం ఉంది. మా చిత్రానికి అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నా” అని చెప్పారు. ‘మా మూవీ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో మీ ముందుకు రాబోతోంది. తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అని నటుడు బానోతు పవన్ అన్నారు.
నటుడు గౌతమ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో డీఎస్పీ విక్రమ్ పాత్రలో నటించా. స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ విజయ్‌లో ఒక మంచి విజన్ చూశా. ఈ సినిమా మా టీమ్‌కు విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నా” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు సతీశ్‌తోపాటు, అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ రాజా కూడా మాట్లాడారు. మూవీ టీమ్ అందరూ పాల్గొన్నారు.