అధునాతన వైద్య సేవల్లో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మరో మైలురాయి
మూడు క్లిష్ట కేసులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు..
జిల్లాలో తొలిసారిగా అల్ట్రాసౌండ్ గైడెడ్ పిగ్టెయిల్ క్యాథెటరైజేషన్
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి అధునాతన వైద్య సేవల్లో మరో మైలురాయిని సాధించింది. మూడు క్లిష్టమైన కేసులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించింది. ముఖ్యంగా జిల్లాలోనే తొలిసారిగా విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు. మంథని మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్తో నెల రోజులుగా బాధపడుతూ పలు ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ సమస్య తగ్గకపోవడంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మోకాలిని శస్త్రచికిత్స ద్వారా తెరిచి లోపల పేరుకుపోయిన చీమును తొలగించారు. అనంతరం ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిన తర్వాత కుడి తొడ భాగం నుంచి చర్మాన్ని తీసుకుని ఎడమ మోకాలి ప్రాంతంలో స్క్రీన్ గ్రాఫ్టీంగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
జిల్లాలో తొలిసారిగా పిగ్టెయిల్ క్యాథెటరైజేషన్
శివపల్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి జ్వరం, వాంతులు, కళ్లు పచ్చబడటం, కడుపునొప్పి వంటి సమస్యలతో జిల్లా ఆసుపత్రికి వచ్చారు. పరీక్షల్లో కాలేయంలో చీము ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా చీమును తొలగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో జిల్లాలోనే తొలిసారిగా ఈ అధునాతన విధానాన్ని విజయవంతంగా నిర్వహించి కాలేయంలోని చీమును తొలగించారు.
డయాబెటిస్తో దెబ్బతిన్న కాలి భాగానికి శస్త్రచికిత్స
కనగర్తి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వ్యక్తి డయాబెటిస్ కారణంగా కాలి బొటనవేలు తీవ్రంగా దెబ్బతిని, కణజాలం చెడిపోవడంతో ఆసుపత్రికి వచ్చారు. వైద్యుల పరిశీలన అనంతరం దెబ్బతిన్న కణజాలాన్ని తొలగించడంతో పాటు ఇన్ఫెక్షన్కు గురైన 1st Metatarsal ఎముకను విజయవంతంగా తొలగించారు. ఈ మూడు క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ప్లాస్టిక్ సర్జన్ డా. అశోక్ రెడ్డి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. మొయినుద్దీన్, ఆర్థోపెడిక్ సర్జన్లు డా. కుమార్ గౌడ్, డా. శ్రీనివాస్ రెడ్డి, డా. మేఘన, డా. వినయ్, జనరల్ సర్జన్లు డా. సాయి ప్రసాద్, డా. రాము, అనస్థీషియా వైద్యులు డా. చంద్రశేఖర్, డా. రామంతో పాటు నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమన్వయంతో సేవలందించారు.
విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్య బృందాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ అభినందించారు. ఈ సందర్భంగా డా. శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో లాపరోస్కోపిక్ సర్జరీలు, లేజర్ చికిత్సలు, ఫిస్టులా చికిత్సలు, యూరాలజీ శస్త్రచికిత్సలు, ఆర్థ్రోస్కోపీ, క్యాటరాక్ట్ సర్జరీలు, రూట్ కెనాల్ సర్జరీలు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వంటి అనేక అధునాతన వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఖరీదైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా ఆసుపత్రిలోనే నాణ్యమైన అధునాతన వైద్య సేవలను ఉచితంగా పొందాలని ఆయన కోరారు.