రాజీవ్‌ రహదారిపై విద్యుత్‌ కోసం రైతుల ధర్నా

13-09-2026 | 12:21am

- సాగుకు 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌

కొండపాక: వ్యవసాయానికి 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా, రాంపల్లి, దుద్దెడ గ్రామాలకు చెందిన రైతులు దుద్దెడ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌(Duddeda electricity substation) వద్ద రాజీవ్‌ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఏఈ సత్యం(Electricity Department AE Satyam)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఈ సత్యం డీఈతో మాట్లాడామని, ఆదివారం నుంచి పాత పద్ధతి ప్రకారం విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

తరచూ విద్యుత్‌ అంతరాయాలతో పంటలకు సకాలంలో సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేకుండా నిర్ణీత 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి రాజీవ్‌ రహదారిపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ కోఆర్డినేటర్‌ ర్యాగల్ల దుర్గయ్య, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నూనె కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు నీల సత్యం, దుద్దెడ సర్పంచ్‌ మిద్దె శివకుమార్, అంకిరెడ్డిపల్లి సర్పంచ్‌ గాలి బాలయ్యతో పాటు పలువురు నాయకులు, ఐదు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు