అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి!
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించాలి- జాజిరి శ్రీనివాస్
సత్తుపల్లి. సెప్టెంబర్ 21,(విజయక్రాంతి): 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల వేదికగా ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లోని ‘అంబేద్కర్ అభయహస్తం’ హామీని(Ambedkar Abhayahastam scheme) వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగారంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ అభయహస్తం’ కింద ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయిస్తామని డిక్లరేషన్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో అనేక మంది ఇప్పటికీ భూమి, ఇల్లు, ఉపాధి, విద్య, స్వయం ఉపాధి వంటి మౌలిక అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 లక్షల ఆర్థిక సాయం హామీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి పలు కేటాయింపులు చేసినప్పటికీ, ‘అంబేద్కర్ అభయహస్తం’ పేరుతో ప్రకటించిన రూ.12 లక్షల ఆర్థిక సాయం హామీ అమలు ప్రస్తుత స్థితిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వ విధానాలుగా అమలు కావాలని అన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, సీఐటీయూ మండల కన్వీనర్ కావూరి వెంకటేశ్వరరావు, మోదుగు వెంకటేశ్వరరావు, పులిజాల సురేందర్, రాంబాబు, శ్రీకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.