ఎల్ నినో పేరుతో కృత్రిమ కరువు
- కృష్ణానదిలో నీళ్లున్నా పైకెత్తలేని ప్రభుత్వం!
- పాలమూరు రైతులను ఎండబెడుతున్న సీఎం రేవంత్
- మాజీ మంత్రి హరీశ్‌రావు
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులకు ఎల్ నినో(El Nino) కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు(Harish Rao) మండిపడ్డారు. నీళ్లు లేక కరువు రాలేదు.. కృష్ణనది(Krishna River)లో నీళ్లు ఉండీ ఎత్తలేని కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో కరువు వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Singireddy Niranjan Reddy), శ్రీనివాస్‌గౌడ్(Srinivas Goud) తో కలిసి మాట్లాడారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Kalwakurthy Lift Irrigation Scheme)లో ఐదు మోటార్లుంటే మూడు కూడా నడపడం లేదని, రోజుకు కేవలం ఎనిమిది గంటలే మోటార్లు నడుపుతున్నారని ఆరోపించారు. 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తే సామర్థ్యం ఉండగా.. కేవలం 800 క్యూసెక్కులకే పరిమితం చేయడం ఎందుకని ప్రశ్నించారు. శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నా పాలమూరు రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత రైతులనే ఎండబెడుతున్నారంటూ మండిపడ్డారు. కృష్ణాలోనే కాదు..
గోదావరిలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని, దేవాదుల నీటిని కూడా పూర్తిస్థాయిలో ఎత్తడం లేదన్నారు. నీళ్లు ఉండి కూడా పంపులు నడపకపోవడం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల పనులు చేపట్టామని మిగిలిన చిన్నపాటి పనులు పూర్తి చేయకపోవడంతో 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కోల్పోతున్నామని ఆరోపించారు.
కృష్ణా జలాల వినియోగంపై మంత్రి ఉత్తమ్ చెపుతున్న లెక్కలను హరీశ్‌రావు తప్పుబట్టారు. శ్రీశైలం నుంచి నీళ్లు ఎక్కడ ఎత్తారు ఎక్కడికి తరలించారు ఏ ఆయకట్టుకు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
కరువు గోదావరిలో లేదు.. కృష్ణాలో లేదు.. కాంగ్రెస్ పాలనలో ఉన్నదన్నారు. కల్వకుర్తి, దేవాదుల పంపులను 24 గంటలు నడిపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూ ప్యాకేజీ- 3 పనులను వెంటనే పూర్తి చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, అల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్మార్ తదితరులు పాల్గొన్నారు.