24 June, 2026 | 5:53 PM

నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ మల్లేష్

24-06-2026 05:11 PM

ఇల్లందు, జూన్ 24 (విజయక్రాంతి): దొరికిన రూ.15 వేల నగదును యజమానికి అప్పగించి ఇల్లందుకు చెందిన ఆటో డ్రైవర్ పిల్లి మల్లేష్ తన నిజాయితీని చాటుకున్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఇల్లందు ఏరియా కమిటీ సభ్యుడైన మల్లేష్ బుధవారం తన ఆటోకు డీజిల్ పోయించుకొని పెట్రోల్ బంకు నుంచి బయటకు వస్తుండగా ఏటీఎం కార్డుతో పాటు రూ.15 వేల నగదు కింద పడి ఉండటం గమనించారు. వెంటనే ఆ నగదును తీసుకుని టీయూసీఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షాకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరూ బంకుకు వెళ్లగా అక్కడ మేనేజర్ ముత్యాల నరేష్ నగదు పోయిందని ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు పరిశీలించిన అనంతరం మల్లేష్ ఆ నగదును మేనేజర్‌కు అప్పగించారు. నెల రోజుల వేతనం కోసం డ్రా చేసిన డబ్బు పోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని, నిజాయితీగా తిరిగి అందించిన మల్లేష్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మేనేజర్ నరేష్ తెలిపారు. మల్లేష్ నిజాయితీని స్థానికులు అభినందించారు.