సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి
- ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు
గుండాల,(విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి నివారించుకోవాలని ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు బుధవారం విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైంఫై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, మహిళలు, యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని హితవు పలికారు. సమాజంలో కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని, నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండి నష్టానికి గురి కావద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ హరికుమారి, సీడీపీఓ మంగతాయారు, సీఐ తిరుపతి, సూపర్వైజర్లు పుష్ప, అన్నపూర్ణ, కోఆర్డినేటర్ సందీప్, సూపర్వైజర్ లలిత, పోలీస్ సిబ్బంది బట్టు మంగయ్య తదితరులు పాల్గొన్నారు.






