మోదీని ఢీకొట్టలేక ఈసీపై నిందలా?
గెలిస్తే ఓకే.. ఓడితే ఈవీఎంల తప్పా?
- ‘సర్’వల్లే గెలిచామని కేరళ కాంగ్రెస్ చెప్పలేదా..
- ఇటలీ మూలాలున్ననేతలకు భారత ప్రజాస్వామ్యమంటే చులకన
- కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలిచే దమ్ములేక, ప్రధాని మోదీని(Prime Minister Modi) ఢీకొట్టలేక ఓటరు జాబితా సవరణ(Voter list revision) నెపంతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని(Central Election Commission) కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) మండిపడ్డారు. మోదీ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Congress Working Committee) డిమాండ్ చేయడం సిగ్గు చేటన్నారు. దేశాన్ని అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో అగ్రపథాన నిలిపినందుకు, ప్రజలు వరుసగా మూడుదఫాలు గెలిపించినందుకు రాజీనామా చేయా లా? ప్రపంచదేశాల సరసన నిలిపినందుకు రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం ఒక ప్రకటన బండి సంజయ్ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎన్నికల కమిషన్, ఈవీఎంలను బాధ్యులుగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ, కర్నాటక, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు పనిచేశాయి కదా? ఉప ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారని.. మరి అక్కడ ఈవీఎంల ఫెయిల్యూర్, ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి వల్లే కాంగ్రెస్ గెలిచినట్టా? అని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వాన్ని బ్రిటీష్ పాలనతో పోల్చడం హేయ మని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమేనని విమర్శించారు. సర్ ప్రక్రియ అమలులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయా న్ని విస్మరించి కేంద్రంపై, ఎన్నికల సంఘంపై నిందలు మోపడం సిగ్గు చేటన్నారు. సర్ ప్రక్రియ అమలులో లోపాలుంటే సరిదిద్దుకునే వ్యవస్థ అందుబాటులో ఉందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ను సైమన్ కమిషన్‌తో పోల్చడం ఆకాశంపై ఉమ్మి వేయడమేనని విమర్శించారు.
భారత ప్రజాస్వామ్య మూలస్తంభాలపైనే దుష్ప్రచారమా?
నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఓడించడం సాధ్యం కాదని సోనియాగాంధీ, మల్లిఖార్జునఖర్గే, రాహుల్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ భావిస్తున్నట్లుందని బండి సంజయ్ పేర్కొన్నారు అందుకే ప్రజాస్వామ్య మూల స్థంభాలపై ప్రజల్లో చులకన భావన కలిగేలా దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటోందని విమర్శించారు. ఇటలీ మూలాలు కలిగిన నేతలు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్‌కు భారత ప్రజాస్వామ్యంపై ఎంత చులకనభావం ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు.సర్ ప్రక్రియను కేరళ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల అభినందించారని గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్ ప్రక్రియ కేరళలో కాంగ్రెస్ విజయానికి దోహదపడిందని చెన్నితల పేర్కొన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ అమలులో చేసిన తప్పిదాలేమిటి? ఆధారాలుంటే బయటపెట్టకుండా ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.