పోలీసుల దెబ్బలు తాళలేక ఆత్మహత్య!
- యువకుడిపై జహీరాబాద్ పట్టణ ఎస్సై వేధింపులు?
- స్టేషన్ ముందు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ధర్నా
- ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జహీరాబాద్, సెప్టెంబరు 29: పోలీస్ కేసులకు(Police cases) భయపడి ఓ యువకుడు ఆత్మహత్య(Young man commits suicide) చేసుకున్న ఘటన వివాదాస్పదంగా మారింది. పోలీసుల దెబ్బలకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కోహీర్ మండలం బిలాల్పూర్ గ్రామానికి చెందిన గూళ్ళ శేఖర్(Gull Shekhar) (32)ను ఒక కేసు విషయంలో సోమవారం విచారణ నిమిత్తం జహీరాబాద్ పట్టణ ఎస్సై లవ కుమార్ పిలిపించి విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆరోపించారు. మంగళవారం నాడు మళ్లీ పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పారు. దీంతో శేఖర్ మళ్లీ తనను కొడతారనే భయంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, నరోత్తం, కోహిర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోవూరు నర్సింలు, కార్యకర్తలతో వెళ్లి జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని, వెంటనే ఎస్సై లవ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేకు మద్దతుగా వెనువెంటనే వందల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని డీఎస్పీ సైదా నాయక్, సీఐ రవి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సంగారెడ్డి నుండి బలగాలను రప్పించారు.
దాదాపు నాలుగైదు వందల మంది పోలీసు వచ్చారు. ఎమ్మెల్యే మాణిక్‌రావును నుంచి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విడిచిపెట్టారు. అనంతరం మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లిన మృతదేహం ఉన్నచోటికి చేరుకున్నారు. ఇక్కడ కూడా జహీరాబాద్ రూరల్ ఎస్సై రాజేందర్‌రెడ్డి, చిరాగ్పల్లి ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును నిర్వహించారు. మృతునికి న్యాయం జరిగే వరకూ పోస్టుమార్టం సహకరించేది లేదని కుటుంబ సభ్యులు భీష్మించారు. కాగా ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.